వాషింగ్టన్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా నన్ను మిస్ అవుతున్నారా అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్‌లో రాజధాని కాబూల్ మినహాయించి మిగతా ప్రధాన నగరాలన్నీ ఇప్పటికే తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అక్కడి నుంచి అమెరికా దళాల ఉపసంహరణ జరుగుతుండటంతో తాలిబన్లు మరోసారి చెలరేగిపోయారు. వరుసగా ఒక్కో కీలకమైన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ వెళ్తున్నారు. అయితే గతేడాది ట్రంప్ ప్రభుత్వం తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే తాము ముందుకు సాగుతున్నామని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.
ఆఫ్ఘన్లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి, ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 2500 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు. చివరికి ఇంతా చేసి దళాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఈ పాపం బైడెన్‌దే అని, ఇప్పటికైనా నన్ను మిస్ అవుతున్నారా అని ట్రంప్ అన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ మిచ్ మెక్కానెల్ మాట్లాడుతూ.. ఓ భారీ, ముందే ఊహించిన, నివారించదగిన విపత్తును బైడెన్ అనుమతించారని విమర్శించారు.
అయితే బైడెన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. అల్‌ఖైదాపై అమెరికా యుద్ధం ఎప్పుడో ముగిసింది. అంతేకాదు 3 లక్షల మంది ఆఫ్ఘన్ సేనలకు శిక్షణ ఇచ్చాము. ఇప్పుడు వారి యుద్ధం వారే చేయాలి. వాళ్ల దేశం కోసం పోరాడాలి అని బైడెన్ స్పష్టం చేశారు.