న్యూయార్క్: మీ పరిసరాల్లో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నారా? అయితే మీరు సులువుగా మీ చుట్టూ వైరస్ ఉనికిని తెలుసుకునేందుకు అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వినూత్న పరికరాన్ని కనుగొన్నారు. ‘ఫ్రెష్ ఎయిర్ క్లిప్’ పేరిట రూపొందించిన ఈ పరికరం ద్వారా వైరస్ ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. ఎంతగా అంటే చాలా చాలా తక్కువ మోతాదులో వైరస్ ఉన్నా కూడా వెంటనే తెలుసుకునేందుకు వీలుంటుందని దీని రూపకల్పనలో పాలుపంచుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టల్ గోడ్రీ వెల్లడించారు. ఈ క్లిప్‌పై ఉన్న ప్రత్యేకమైన కెమికల్ పూత వైరస్‌ను పసిగడుతుందని, ఈ పరికరాన్ని సులభంగా ధరించవచ్చని పేర్కొన్నారు. ఈ పరికరం వైరస్ వ్యాప్తి చెందకుండా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలను వైరస్ ఉనికిపై అప్రమత్తం చేస్తుందని వివరించారు.