కాలిఫోర్నియా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai) అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ మోడల్స్‌లో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. సమాచార స్పష్టత కోసం ఏఐతో పాటు ఇతర విధానాలను కూడా సరిచూసుకోవాలని ఆయన సూచించారు.
సుసంపన్నమైన సమాచార వ్యవస్థను రూపొందించుకోవాలని, కేవలం ఏఐ టెక్నాలజీ మీద మాత్రమే ఆధారపడవద్దు అని ఆయన అన్నారు. దీని కోసమే ప్రజలు గూగుల్ సెర్చ్ వాడుతున్నారని, కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు తమ వద్ద ఇతర వ్యవస్థలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ ఏదైనా సృజనాత్మకంగా రాయాలని భావిస్తే, అప్పుడే ఏఐ టూల్స్‌ను సక్రమంగా వినియోగించే రీతిలో ఉండాలని, ఆ టూల్స్ చెప్పే ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మరాదు అని అన్నారు.
కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చేందుకు చాలా వర్క్ చేస్తున్నామని, దీని పట్ల గర్వంగా ఉందన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఏఐ విధానాలతో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్పారు. గూగుల్ ఏఐ తాజా మోడల్ జెమిని 3.0 కోసం టెకీ ప్రపంచం ఎదురుచూస్తున్నది. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో ఏఐ మోడ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూజర్ల కోసం జెమిని చాట్‌బాట్‌ను జోడించింది. ఏఐ సెక్యూర్టీ గురించి కూడా పెట్టుబడి పెంచినట్లు పిచాయ్ తెలిపారు. ఏదైనా ఇమేజ్ ఏఐ ద్వారా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.