DNA | న్యూయార్క్, సెప్టెంబర్ 5: లైంగిక దాడి కేసుల విచారణలో కీలకమైన డీఎన్ఏ పరీక్షను కేవలం 45 నిమిషాల్లోనే జరిపే కొత్త ఫోరెన్సిక్ సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధునాతన ల్యాబ్ సదుపాయం అవసరం లేకుండానే డీఎన్ఏ పరీక్షను చేయవచ్చని పరిశోధక బృందంలో ఒకరైన మహమ్మద్ ఎల్సాయెద్ తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు, నేరం రుజువు చేసేందుకు డీఎన్ఏ పరీక్ష కీలకమైన ఆధారంగా ఉంటుంది. ఇందుకోసం ముందు బాధితుల శరీరం నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపిస్తారు.
ల్యాబ్‌లో నిపుణులు చాలా క్లిష్టమైన ప్రక్రియ ద్వారా బాధితుల, ముద్దాయి డీఎన్ఏ నమూనాలను వేరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముద్దాయి డీఎన్ఏను విశ్లేషించే వీలు ఉంటుంది. ఈ ప్రక్రియకు కొన్ని రోజుల సమయం పడుతుంది. తాము అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికతతో కేవలం 45 నిమిషాల్లోనే డీఎన్ఏ నమూనాలను వేరు చేసి, పరీక్షించే వీలు ఉంటుందని మహమ్మద్ ఎల్సాయెద్ తెలిపారు. సేకరించిన శాంపిల్ నుంచి ఇద్దరు వ్యక్తుల డీఎన్ఏను తమ కొత్త సాంకేతికత ద్వారా డిజిటల్ మైక్రోఫ్లూయిడిక్స్ను ఉపయోగించి వేగంగా వేరు చేయవచ్చని చెప్పారు. ఇందుకు అధునాతన ల్యాబ్ అవసరం కూడా లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్డ్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.