న్యూయార్క్, ఇస్లామాబాద్, జూన్ 19 : భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్‌లకు చెందిన ఇద్దరు చాలా తెలివైన నాయకులు గత నెలలో జరిగిన సంఘర్షణను అణు యుద్ధంగా మార్చకుండా ముగించాలని నిర్ణయించుకున్నారని ట్రంప్ ప్రశంసించారు. శ్వేత సౌధంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో బుధవారం విందు సమావేశం అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య మే 7-10 మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. తర్వాత హఠాత్తుగా కాల్పుల విరమణ జరిగింది.
ఈ కాల్పుల విరమణకు తానే కారణమని, రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించి అణుయుద్ధాన్ని నివారించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడినట్టు ట్రంప్ ఇప్పటికే డజను సార్లకు పైగా బహిరంగంగా ప్రకటించారు. అయితే దానిని భారత్ ఖండిస్తూ వచ్చింది. కాగా, మునీర్‌ను కలవడం గౌరవంగా ఉందని, ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ఇరు దేశాల నేతలు చర్చించుకున్నామని ట్రంప్ చెప్పారు. కాగా, ఈ యుద్ధంలో అమెరికా కనుక నేరుగా రంగంలోకి దిగితే టెహ్రాన్‌పై దాడులు చేయడానికి ఆ దేశం పాకిస్థాన్ మిలిటరీ బేస్‌లను వాడుకుంటుందని, ఈ క్రమంలోనే మునీర్‌తో చర్చలు జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. కాగా, మునీర్‌కు ట్రంప్ విందు ఇవ్వడం దౌత్య వైఫల్యమేనని కేంద్రంపై కాంగ్రెస్ మండిపడింది.