Israel | జెరూసలేం, అక్టోబర్ 9: అధునాతన ఆయుధాలకు పేరొందిన ఇజ్రాయెల్ సరికొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. డ్రోన్ల దాడులు జరుగుతున్న వేళ లేజర్ లైట్‌తో డ్రోన్లను కూల్చగలిగే లైట్ బీమ్ లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థను తయారుచేసింది. త్వరలో దీనిని వాషింగ్టన్ డీసీలో ప్రదర్శించనుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ట్రోఫీ అనే యాంటీ ట్యాంక్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నది. దీనికే ఈ కొత్త వ్యవస్థను సైతం జత చేయనున్నది. ఇప్పటికే ఈ కొత్త వ్యవస్థ సామర్థ్యాలను ఇజ్రాయెల్ పరీక్షించింది. డ్రోన్లను కూల్చేయడంలో ఇది సమర్థంగా పని చేస్తున్నట్టు తెలుస్తున్నది. రాకెట్లు, దీర్ఘశ్రేణి క్షిపణులపై మాత్రం ఇది పని చేయదు. హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్ సంస్థలతో పాటు ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ ఇజ్రాయెల్‌కు కీలకంగా మారనున్నది.
హమాస్ అధినేత నస్రల్లాను హతమార్చినందుకు ప్రతీకారంగా గతం వారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపించింది. అయితే దీనికి బదులు తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి ప్రతి దాడి చేయలేదు. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలెంట్ బుధవారం స్పందించారు. ఇరాన్‌పై తాము చేసే దాడి విధ్వంసకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మా దాడితో ఇరాన్ గందరగోళంలో పడుతుంది. అసలేం జరిగిందో, ఎలా జరిగిందో వారికి అర్థం కాదని అన్నారు. కాగా, ఇరాన్ అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి జరపవచ్చునని ప్రచారం జరుగుతున్నది.