Cory Booker | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆయన తీసుకునే నిర్ణయాలపై అమెరికన్ నేతలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వైఖరి పట్ల డెమోక్రట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ సెనేటర్ (Democratic Senator) కోరీ బూకర్ (Cory Booker) ఓ అరుదైన రికార్డు సృష్టించారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆయన దాదాపు 25 గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రసంగించారు. తద్వారా సెనేట్ చరిత్రలోనే ఇలా సుదీర్ఘ ప్రసంగం చేసిన సభ్యుడిగా రికార్డు సాధించారు.
న్యూజెర్సీ సెనెటర్, డెమోక్రటిక్ నేత అయిన 55 ఏళ్ల కోరీ బూకర్.. సోమవారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాత్రి అయినా తన ప్రసంగాన్ని ఆపలేదు. మంగళవారం సాయంత్రం వరకూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం మొత్తం నిలబడే సాగింది. మధ్యలో చిన్నపాటి విరామం కూడా తీసుకోకుండా ఆయన ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా 25 గంటల 5 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. ఛాంబర్ చరిత్రలోనే ఇదే అత్యంత సుదీర్ఘ స్పీచ్. దీంతో 1957లో పౌరహక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ రిపబ్లికన్ నేత స్ట్రోమ్ థర్మోండ్ చేసిన ప్రసంగం రికార్డును కోరే బద్దలు కొట్టారు. అప్పుడు స్ట్రోమ్ 24 గంటల 18 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు ఇదే సుదీర్ఘ స్పీచ్‌గా ఉంది. ఇప్పుడు కోరీ బూకర్ 25 గంటలకు పైగా మాట్లాడి ఆ రికార్డును బద్దలుగొట్టారు.
Also Read..
Sunita Williams | పెంపుడు శునకాలతో సరదాగా గడిపిన సునీతా విలియమ్స్.. వీడియో వైరల్
క్షిపణులను సిద్ధం చేస్తున్నాం.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్పందన