Death Penalty | దోహా, అక్టోబర్ 26: గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రైవేట్ సంస్థ దోహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న వీరిపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నమోదయ్యాయి. ఖతార్ అధికారులు వీరిని గత ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరికి మరణశిక్ష విధిస్తూ ‘కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఖతార్’ గురువారం తీర్పు వెలువరించింది. దీనిపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటామని, అన్ని మార్గాల్ని వినియోగిస్తామని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది.
‘కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యాం. తీర్పు పూర్తి ప్రతి కోసం ఎదురుచూస్తున్నాం. నేవీ మాజీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో మా లీగల్ టీం మాట్లాడింది. వారిని విడుదల చేయడానికి ఉన్న దారులను అన్వేషిస్తాం’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అరెస్టు చేసింది. ఇజ్రాయెల్ తరఫున వీరంతా ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వీరిపై నమోదయ్యాయి. ఈ కేసులో తమ వద్ద ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలు ఉన్నాయని ఖతార్ అధికార యంత్రాంగం చెబుతున్నది.
తమ వాళ్లను ఖతార్ ప్రభుత్వం నిర్బంధించటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాని మోదీకి గత ఏడాది లేఖ కూడా రాశారు. ఈ కేసులో తమ సోదరుడిని విడిపించేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలంటూ ఓ యువతి ప్రధాని మోదీని వేడుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ట్యాగ్ చేస్తూ, ‘దేశ గౌరవాన్ని పెంచిన నేవీ మాజీ అధికారుల్ని తిరిగి భారత్‌కు రప్పించాలి. ప్రధాని మోదీని చేతులు జోడించి వేడుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.