న్యూఢిల్లీ, జనవరి 6: గ్రీన్‌లాండ్‌ని ఆక్రమించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తే అది నాటో సైనిక కూటమి అంతమేనని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ హెచ్చరించారు. నాటో సభ్య దేశంపైనే అమెరికా సైనిక చర్యకు పాల్పడితే యావత్ నాటో వ్యవస్థ కూలిపోతుందని, ఇక ఏమీ మిగలదని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. వెనెజువెలాపై దాడికి సంబంధించి ఆదివారం విలేకరులు అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. డెన్మార్క్‌కు చెందిన స్వయం ప్రతిపత్తి గల ద్వీపమైన గ్రీన్లాండ్ నాటోలో భాగం కూడా. డెన్మార్క్, అమెరికా నాటో సభ్యదేశాలు. ఈ దేశాల సార్వభౌమత్వానికి, భద్రతకు నాటో భరోసా కల్పిస్తోంది. నాటో నిబంధనల ప్రకారం ఏదైనా సభ్యదేశంపై జరిగే సైనిక చర్యను కూటమి సభ్యులందరిపై జరిగిన దాడిగా పరిగణించాల్సి ఉంటుంది.