వాషింగ్టన్, జనవరి 7: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ మార్గాలను అన్వేషిస్తున్నారని, అమెరికా సైన్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఎప్పటికీ అధ్యక్షుడికి ఉంటుందని మంగళవారం వైట్ హౌస్ ప్రకటించింది. వైట్ హౌస్ వ్యాఖ్యలతో నాటో సభ్య దేశమైన డెన్మార్క్‌తో అమెరికాకు తలెత్తిన ఉద్రిక్తతలు మరింత తీవ్రం కానున్నాయి. అపార్థాలను తొలగించుకోవడానికి అమెరికాతో వెంటనే సమావేశం నిర్వహించాలని గ్రీన్లాండ్, డెన్మార్క్ కోరుతున్న తరుణంలో అమెరికా నుంచి తాజా హెచ్చరికలు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెనెజువెలాలో అమెరికా సైనిక జోక్యం తర్వాత ఆర్కిటిక్‌లోని స్వయం ప్రతిపత్తితో కూడిన డానిష్ ద్వీపం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం ప్రత్యర్థి దేశాలైన రష్యా, చైనాను నిలువరించడానికి అమెరికాకు జాతీయ భద్రతాపరమైన ప్రాధాన్యతగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అభివర్ణించారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధానం లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించాల్సిన భిన్న మార్గాలపై అధ్యక్షుడు, ఆయన బృందం విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. అయితే ఇందుకోసం అమెరికా సైన్యాన్ని ఉపయోగించుకోవడం అధ్యక్షుడికి ఎల్లప్పుడూ ఉండే అవకాశమేనని ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ అంశాన్ని వెంటనే చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరినట్లు గ్రీన్లాండ్, డెన్మార్క్ అంతకుముందు ప్రకటించాయి. ఇప్పటివరకు అది సాధ్యం కాలేదని గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్ష్ఫెల్డ్ సోషల్ మీడియాలో తెలిపారు.
మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించాలని 2025లో పదేపదే అమెరికాను గ్రీన్లాండ్, డానిష్ ప్రభుత్వాలు కోరినప్పటికీ అది సఫలం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూబియోను కలిస్తే కొన్ని అపార్థాలు తొలగిపోవచ్చని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లొక్కే రస్ముస్సెన్ పేర్కొన్నారు. కాగా, తమ ద్వీపం అమ్మకానికి లేదని, దాని భవిష్యత్తును గ్రీన్లాండ్ పౌరులే నిర్ణయిస్తారని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సెన్ పునరుద్ఘాటించారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని, సరిహద్దు సమగ్రతను సమర్థిస్తామంటూ డెన్మార్క్‌కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్ సంఘీభావం తెలియచేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఐరోపా దేశాల నాయకులకు సోషల్ మీడియా వేదికగా నీల్సెన్ కృతజ్ఞతలు తెలిపారు.