షాంఘై: కరోనా పుట్టినిళ్లు చైనాలో (China) మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
షాంఘైలో 57 కొత్త కేసులు నమోదయ్యాయని, దేశీయంగా 203 కరోనా లక్షణాలున్న వారిని గుర్తించామని అధికారులు వెల్లడించారు. కాగా, మార్చి 17 నాటికి చైనా ప్రధాన భూభాగంలో 1,26,234 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 4636 మంది మరణించారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా కరోనా కేసుల సంఖ్యను ప్రకటించలేదు.