న్యూఢిల్లీ, జనవరి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సోమవారం దీటుగా స్పందించారు. కొలంబియాపై సైనిక చర్యలు చేపడుతామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై పెట్రో స్పందిస్తూ ఆయుధాలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ జవాబిచ్చారు. కొకైన్ తయారుచేసి అమెరికాకు అమ్ముతున్న రోగిగా పెట్రోను ట్రంప్ అభివర్ణిస్తూ కొలంబియాపై దాడి తప్పదని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై కొలంబియా మొట్టమొదటి లెఫ్టిస్టు నాయకుడు, ఎం-19 గెరిల్లా గ్రూపు మాజీ సభ్యుడైన పెట్రో ఎక్స్ వేదికగా స్పందించారు.
మళ్లీ ఆయుధాన్ని పట్టుకోకూడదని ప్రతిజ్ఞ చేశాను. కాని నా దేశం కోసం మళ్లీ ఆయుధాలు పట్టుకుంటాను అంటూ పెట్రో ప్రకటించారు. నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా కొలంబియా చేపట్టిన వ్యూహాన్ని సమర్థించిన పెట్రో మితిమీరిన సైనిక బల ప్రయోగం వద్దని హెచ్చరించారు. తగిన సాక్ష్యాలు లేకుండా ఈ గ్రూపులపై ఒక్క బాంబు వేసినా అనేకమంది పిల్లలు మరణిస్తారని, రైతులపై బాంబులు వేస్తే వేలాదిమంది కొండల్లో గెరిల్లాలుగా మారుతారని పెట్రో పేర్కొన్నారు. అత్యధిక మంది ప్రజలు ప్రేమించే, గౌరవించే అధ్యక్షుడిని నిర్బంధిస్తే చిరుతపులిని రెచ్చగొట్టినట్లేనని ట్రంప్‌ను ఉద్దేశించి పెట్రో రాసుకొచ్చారు.