Batteries | బీజింగ్ : లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని ఆరు రెట్లు పెంచే సరికొత్త సాంకేతికతను చైనాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. స్మార్ట్ ఫోన్ల నుంచి విద్యుత్తు వాహనాల వరకు ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీల వినియోగం పెరుగుతున్నది. ఈ బ్యాటరీలకు చార్జింగ్ పెట్టినప్పుడు వీటిల్లో ఉండే లిథియం అయాన్లు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగటివ్ టెర్మినల్‌కు వెళతాయి. తర్వాత విద్యుత్తును ఉత్పత్తి చేసినప్పుడు మళ్లీ రివర్స్ వస్తాయి. ఈ ప్రక్రియ నెమ్మదించినప్పుడు, బ్యాటరీలోని ఇతర భాగాలు పని చేస్తున్నా బ్యాటరీ జీవితకాలం ముగిసినట్టు భావిస్తారు.
ఈ సమస్యను గుర్తించిన ఫుడాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గవో యు, పెంగ్ హుయిషెంగ్.. బ్యాటరీల్లో కదలిక శక్తిని కోల్పోయిన లిథియం అయాన్లను మళ్లీ చురుగ్గా మార్చే పరిశోధనలు చేశారు. ట్రైఫ్లోరోమీథైల్సల్ఫోనేట్ లిథియం అనే పదార్థాన్ని బ్యాటరీలోకి పంపించడం ద్వారా ఇది సాధ్యమేనని గుర్తించారు. దీనిపై ప్రయోగాలు జరపగా.. 2 వేల సార్లు చార్జ్ అయ్యే బ్యాటరీ జీవితకాలం 12 వేల సార్లకు పెరిగిందని గవో యు తెలిపారు. ఈ కొత్త సాంకేతికత ద్వారా తక్కువ ధరతోనే బ్యాటరీల జీవితకాలాన్ని ఆరు రెట్లు పెంచవచ్చని చెప్పారు. దీని ఉత్పత్తి కోసం అంతర్జాతీయ బ్యాటరీ కంపెనీలతో జత కడుతున్నామన్నారు.