Diabetes | బీజింగ్, సెప్టెంబర్ 29: ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మధుమేహ మహమ్మారితో బాధపడుతున్నారు. 2040 నాటికి ప్రతి ఎనిమిది మందిలో ఒకరు డయాబెటిస్ బారిన పడతారని తాజా అధ్యయనాలు అంచనావేస్తున్నాయి. మనదేశంలోనూ 7 కోట్ల మందికిపైగా చక్కెర వ్యాధి బాధితులు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మధుమేహాన్ని అంతమొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. ఓ మహిళలో టైప్ 1 డయాబెటిస్‌ను సంపూర్ణంగా నయం చేశారు. స్టెమ్‌సెల్స్ థెరపీ ద్వారా పెకింగ్ వర్సిటీ మెడికల్ రిసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. పరిశోధనలో పాల్గొన్న టియాన్జింగ్ నగరానికి చెందిన 25 ఏండ్ల మహిళ గత ఏడాదికాలంగా స్వేచ్ఛగా తీపి పదార్థాలను తింటున్నదని వైద్యులు తెలిపారు.
ప్రపంచంలోనే తొలిసారిగా 59 ఏండ్ల వ్యక్తికి డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేసినట్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా ఆయనకు వ్యాధిని నయం చేసినట్టు చెప్పారు. ఈ విధానంలో రోగి స్టెమ్‌సెల్స్‌ను ప్రత్యేక కెమికల్ కాక్టెయిల్ ద్వారా మార్పులు చేసి, వాటిని క్లోమంలో ప్రభావితమైన కణాల స్థానంలో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు.
ఈ కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఎంఆర్ఐ ద్వారా వీటిని పర్యవేక్షించేందుకు కష్టంగా ఉండేది. దీంతో కొత్త విధానంలో ఈ కణాలను పొత్తి కడుపు కింద, క్లోమగ్రంథికి దగ్గరగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. దీంతో ఎంఆర్ఐ ద్వారా సులభంగా పర్యవేక్షించవచ్చని వైద్యులు తెలిపారు. ఈ విధానం ద్వారా 25 ఏండ్ల మహిళకు టైప్ 1 డయాబెటిస్‌ను పూర్తిగా రివర్స్ చేసినట్టు వెల్లడించారు. ఇది ఇతర రోగుల్లోనే విజయవంతమైతే అద్భుతంగా ఉంటుందని డయాబెటిక్ పరిశోధకులు, క్యోటో యూనివర్సిటీకి చెందిన డైసుకే యాబే అభిప్రాయపడ్డారు.