బీజింగ్: తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు చేసేందుకు ఒక బాలుడు (China boy) పెద్ద సాహసం చేశాడు. ఒంటరిగా సైకిల్ తొక్కుతూ బామ్మ ఊరికి బయలుదేరాడు. రోజంతా సైకిల్ తొక్కి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అయితే దారి తప్పి బాగా అలసిపోయి నీరసంతో ఒక చోట కూలబడ్డాడు. గమనించిన స్థానికులు ఆ బాలుడ్ని పోలీసులకు అప్పగించారు. విస్తూపోయే ఈ సంఘటన చైనాలో జరిగింది. 11 ఏళ్ల బాలుడు తన తల్లితో గొడవపడ్డాడు. దీంతో తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఇంట్లో చెప్పకుండా సైకిల్‌పై ఒంటరిగా బయలుదేరాడు. జెజియాంగ్ ప్రావిన్స్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మమ్మ ఊరికి చేరుకునేందుకు సుమారు 24 గంటలపాటు సైకిల్ తొక్కాడు.
కాగా, రహదారిపై ఉన్న సైన్బోర్డ్ గుర్తుల వల్ల ఆ బాలుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. దీంతో పలు చోట్ల తప్పుడు మలుపులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో చేరుకోవాల్సిన దూరానికి రెండింతల దూరం సైకిల్ తొక్కాడు. మరో గంటలో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా బాగా అలసిపోయాడు. నీరసించిన ఆ బాలుడు ఎక్స్‌ప్రెస్‌వే సొరంగంలో సేదతీరాడు. తన వెంట తెచ్చుకున్న రొట్టె తిని రాత్రంతా ఆ సొరంగంలోనే గడిపాడు.
మరోవైపు ఎక్స్‌ప్రెస్‌వే సొరంగంలో కదలలేని స్థితిలో ఉన్న ఆ బాలుడ్ని స్థానికులు మరునాడు గుర్తించారు. తీవ్ర అలసట వల్ల నడవలేని స్థితిలో ఉన్న బాలుడ్ని ఒక కారులో సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. దీంతో పోలీసులు ఆ బాలుడి తల్లికి ఈ సమాచారం ఇచ్చారు. కాగా, తనపై అమ్మమ్మకు ఫిర్యాదు చేస్తానని కుమారుడు ఎప్పుడూ అనేవాడని, అయితే ఇంతపని చేస్తాడని ఊహించలేదని ఆ బాలుడి తల్లి మీడియాకు తెలిపింది. కుమారుడు చేసిన పెద్ద సాహసం సంగతి తెలుసుకుని షాక్ అయ్యినట్లు ఆమె చెప్పింది.
Also Read: