బీజింగ్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అఫ్ఘానిస్థాన్ సరిహద్దు సమీపంలో చైనా కొత్త కౌంటీని ఏర్పాటు చేస్తున్నది. ఇరుకైన వఖన్ కారిడార్‌లో వీగర్ వేర్పాటువాద మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకొనేందుకు గ్జియాంగ్ ప్రావిన్స్‌లో చైనా ప్రభుత్వం ఈ కౌంటీని ఏర్పాటు చేయనున్నట్టు పీటీఐ రిపోర్ట్ చేసింది. సెన్లింగ్గా పిలువనున్న ఈ కౌంటీ కారాకోరం పర్వత శ్రేణికి దగ్గరగా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
ముస్లింల ప్రాబల్యం కలిగిన వీగర్ ప్రాంతంలో ఏడాది కాలంలో చైనా ఏర్పాటు చేయనున్న మూడో కౌంటీ ఇది. క్షేత్ర స్థాయిలో బలమైన ప్రభుత్వ వ్యవస్థను నిర్మించి సమర్థమైన పరిపాలన అందించి, ఆ ప్రాంతంపై నియంత్రణ కలిగి ఉండేందుకు చైనా ఈ కొత్త కౌంటీని ఏర్పాటు చేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసిన హీన్, హెకంగ్ కౌంటీలపై భారత్ తన నిరసన వ్యక్తం చేసింది.