T-Flight | హైదరాబాద్, డిసెంబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): విమానంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలం. రైల్లో అయితే 100 కిలోమీటర్లే ఎక్కువ. అయితే, చైనాలో త్వరలో అందుబాటులోకి రానున్న వినూత్న రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవట. మాగ్లెవ్ ట్రైన్ నెట్వర్క్ సాయంతో ప్రయాణించే ఈ రైళ్లను టీ-ఫ్లైట్స్‌గా పిలుస్తున్నారు.
సాధారణంగా రైళ్ల వేగాన్ని రెండు అంశాలు నియంత్రిస్తాయి. పట్టాలు-రైలు చక్రాల మధ్య ఘర్షణ ఒకటైతే, రెండోది ప్రయాణంలో రైలుకు ఎదురుగా వచ్చే గాలి. ఈ రెండింటికీ చెక్ పెడుతూ రైలు వేగాన్ని అమాంతం పెంచే సరికొత్త నెట్‌వర్క్‌నే ‘మాగ్లెవ్ ట్రైన్ నెట్వర్క్’గా పిలుస్తున్నారు.
మాగ్లెవ్ ట్రైన్ నెట్వర్క్ విధానంలో రైలు ఓ టన్నెల్ వంటి హైపర్‌లూప్ నిర్మాణం గుండా ప్రయాణిస్తుంది. అంటే గాలి నుంచి వచ్చే నిరోధకత తగ్గుతుందన్న మాట. ఇక, ఈ విధానంలో ప్రయాణించే ట్రైన్‌కు చక్రాలు అనేవి ఉండవు. పట్టాలపై మ్యాగ్నెట్స్ (అయస్కాంతాలు) ఉంటాయి. అలా రైలు కింద ఉన్న ప్రత్యేక మ్యాగ్నెట్స్కు పట్టాలపై ఉండే మ్యాగ్నెట్స్‌తో వికర్షణ ఏర్పడి రైలు వేగాన్ని అందుకొంటుంది.
షాంఘై మాగ్లెవ్లో ఒక్కో రైలు గంటకు 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటే, చాంగ్షా మాగ్లెవ్లో ఒక్కో రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. అయితే, త్వరలో నిర్మించనున్న కొత్త మాగ్లెవ్ ట్రైన్ నెట్‌వర్క్‌లో రైలు వేగాన్ని గంటకు వెయ్యి కిలోమీటర్లు దాటించాలని ఇంజినీర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు ప్రారంభమైనట్టు ‘గ్లోబల్ టైమ్స్’ వెల్లడించింది.