India Pakistan Tension |ఇస్లామాబాద్, మే 10: పాక్ తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిలబెట్టుకోవటంలో ఆ దేశానికి అండగా ఉంటామని చైనా ప్రకటించింది. శనివారం చైనా-పాక్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై చైనా విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, భారత్-పాక్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితిని పాక్ విదేశాంగ మంత్రి దార్ చైనాకు వివరించారు. దీనిపై వాంగ్ యీ స్పందిస్తూ, ‘పాక్-చైనా స్నేహం ఉక్కు కవచం లాంటిది. చైనాకు పాక్ వ్యూహాత్మక భాగస్వామి. ప్రాదేశిక సమగ్రత, స్వతంత్రత, తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవటంలో పాక్‌కు చైనా అండగా నిలుస్తుంది’ అని అన్నారు.
రెండు పాక్ జెట్ ఫైటర్లు కూల్చివేత
న్యూఢిల్లీ, మే 10 : పాకిస్థాన్‌కు చెందిన రెండు జెట్ ఫైటర్లను భారత్ కూల్చివేసింది. శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి ప్రయోగించిన మిసైల్ దాడులతో ఈ జెట్ ఫైటర్లను కూల్చివేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపినట్టు న్యూస్ 18 కథనం వెల్లడించింది. శ్రీనగర్ సమీపంలోని లస్జాన్ వద్ద ఒకటి, ఉత్తర కశ్మీర్లో మరోక జెట్ ఫైటర్‌ను కూల్చివేసింది. పాకిస్థాన్ దాడులను తీవ్రతరం చేయడంతో శనివారం భారత్ మొత్తం ఐదు మిస్సైల్లతో శ్రీనగర్ నుంచి దాడులు చేసింది. పాకిస్థాన్‌పై ప్రతిదాడులను తీవ్రతరం చేసిన భారత్ శనివారం వేకువజామున ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసినట్టు సంబంధిత వర్గాలు సీఎన్ఎన్కు తెలిపినట్టు వెల్లడించింది.