China | బీజింగ్, సెప్టెంబర్ 5 : దేశంలో 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తులలో ఒకదానిగా తీర్చిదిద్దాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ వారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులను ‘క్రమశిక్షణ’లో ఉంచేందుకు ఉపాధ్యాయులకు హక్కు కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన వారిని, తప్పుడు పనులు చేసిన వారిని ఎంతమాత్రం ఉపేక్షించరు.
ఉల్లంఘనులు కఠిన క్రమశిక్షణా చర్యలతో పాటు న్యాయపరమైన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 1.89 కోట్ల మంది టీచర్లతో చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధ్యాయ వ్యవస్థ కలిగి ఉంది. అయితే చైనా విద్యా విధానంపై కొన్ని విమర్శలు ఉన్నాయి. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తరగతి ముగిసిన తర్వాత కూడా నిర్బంధించడం, తరగతులు జరుగుతున్న సమయంలో వారిని నుంచోపెట్టడం వంటి చర్యలను విద్యావంతులు తప్పుబడుతున్నారు.