Israel Hamas War | జెరూసలేం, జనవరి 18: పాలస్తీనాలోని గాజాలో 15 నెలల భీకర పోరాటానికి తెర పడనుంది. బాంబు దాడులతో శిథిలమైన వీధుల్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఖతార్ మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందానికి ఇప్పటికే హమాస్ అంగీకరించగా, తాజాగా ఇజ్రాయెల్ మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది. దీంతో ఆదివారం నుంచి ఒప్పందంలో మొదటి దశ అమలులోకి రానున్నది. ఆరు వారాల పాటు అమలులో ఉండనున్న మొదటి దశలో ఇరు పక్షాలు పూర్తిగా కాల్పుల విరమణను పాటించనున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు.
ఆదివారం నుంచి ఇరుపక్షాలు బందీలను విడుదల చేస్తాయని ఖతార్ ప్రకటించింది. మొదటి దశలో భాగంగా తమ జైళ్లలో ఉన్న 737 మందిని విడుదల చేయనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. విడుదలయ్యే వారి జాబితాలో పాలస్తీనా ప్రజలు హీరోగా చూసే ఫతాహ్ పార్టీ సాయుధ విభాగాధిపతి జకేరియా జుబేదీ, ఆ దేశ వామపక్ష నేత ఖలీఫా జరార్ కూడా ఉన్నారు. అయితే, హమాస్ తమ వారిని ఎంత మందిని విడుదల చేస్తుందనే దానిపై తాము విడుదల చేసే వారి సంఖ్య ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడి చేసింది. 1200 మంది ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు 251 మందిని కిడ్నాప్ చేసింది. ఈ దాడికి ప్రతిఘటనగా హమాస్ కేంద్రమైన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. 15 నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో 46,500 మంది పాలస్తీనీయులు మరణించారని అంచనా. గాజాలోని 60 శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. నగరంలోని 4.2 కోట్ల టన్నుల శిథిలాలను తొలగించేందుకే పదేండ్లు పట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి.
15 నెలల యుద్ధంలో ఇజ్రాయెల్ అహంకారాన్ని అణిచివేశామని హమాస్ ప్రకటించింది. ఆక్రమణకు ముగింపు పలకడానికి, విముక్తి పొందడానికి, సొంత ప్రాంతానికి రావడానికి పాలస్తీనీయులు చేరువలో ఉన్నారని ప్రకటించింది. పాలస్తీనా ప్రజల త్యాగాల వల్లే ఇజ్రాయెల్ అనుకున్నది సాధించలేకపోయిందని హెజ్బొల్లా నేత నయీం ఖాసీం పేర్కొన్నారు.