హౌస్టన్, ఆగస్టు 18: అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన కారు ప్రమాదంలో లియాండర్లో నివసించే భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. టెక్సాస్లోని లాంపసస్ కౌంటీలో బుధవారం వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొన్న ప్రమాదంలో అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీప అరవింద్ (40), వారి కుమార్తె ఆండ్రీ అవరింద్ (17) మరణించారు. ప్రమాదం జరిగినప్పుడు 14 ఏండ్ల వారి కుమారుడు అదిర్యన్ వారితో వాహనంలో లేడు. ఈ ప్ర మాదంలో మొత్తం ఐదుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
లండన్ : మహిళలు, బాలికల పట్ల హింసను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇస్లామిస్ట్, ఫార్-రైట్ తీవ్రవాదంతో వ్యవహరించినట్లుగానే స్త్రీ ద్వేషులపై కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింస గురించి నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ ఇచ్చిన నివేదికలో ఇది జాతీయ స్థాయి అత్యవసర పరిస్థితి అని తెలిపింది. దీంతో మితిమీరిన స్త్రీద్వేషాన్ని ఉగ్రవాదంగా పరిగణించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని సమీక్షించాలని హోం సెక్రటరీ యెవెట్టీ కూపర్ ఆదేశించారు.