న్యూఢిల్లీ: బంగ్లాదేశ్(Bangladesh)లోని రాజ్బరి జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. పద్మా నదిలో బస్సు పడిన ఘటనలో 16 మంది మృతిచెందారు. సుమారు 20 మంది వరకు ఆచూకీ లేరని తెలుస్తోంది. ట్రాన్స్పోర్ట్ ఫ్రెరీ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపు తప్పి బస్సు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 5.15 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. క్రేన్ల సహాయంతో బస్సును నది నుంచి బయటకు తీశారు. ఆ బస్సులో సుమారు 14 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. గజ ఈతగాళ్లు ఓ ఇద్దరు మహిళలను రక్షించారు.
ప్రతికూల వాతావరణంలో దాదాపు ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మిలిటరీ, పోలీసు సహకారంతో అగ్నిమాపక, కోస్టుగార్డు డైవర్లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఢాకాకు వెళ్తున్న ఆ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు భావిస్తున్నారు. దీంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈద్ సెలవులు ముగిసిన తర్వాత పిల్లలు మళ్లీ రాజధానికి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన పట్ల విచారణ చేపట్టాలని ప్రధాని తారిక్ రెహ్మాన్ ఆదేశించారు.సుమారు 11 మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని పోలీసులు చెప్పారు.