Brazil Coup Plot | బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఈ కుట్రతో సంబంధం ఉన్న ఐదుగురు అధికారులను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 ఎన్నికల్లో ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కూడా కుట్ర దారులు ప్లాన్లు వేశారని పోలీసులు తెలిపారు. దేశ ఉపాధ్యక్షుడు గెరాల్డో అల్కిమిన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండ్రే డీ మొరాయిస్ లను కూడా హత్య చేసేందుకు వారు కుట్ర పన్నారని తమ విచారణలో తేలిందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
కుట్ర దారుల్లో నలుగురు మిలిటరీ అధికారులు, ఒకరు పోలీసు అధికారి ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు ఐదు అరెస్ట్ వారంట్లు, మూడు సెర్చ్ అండ్ సీజర్ వారంట్లు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుల పాస్ పోర్టులను కూడా జప్తు చేసినట్లు చెప్పారు. ఈ కుట్ర అమలు చేసేందుకు ఆర్మీ ప్రత్యేక దళాల్లో మిలిటరీ జవాన్లకు శిక్షణ ఇచ్చారని తేలింది. వీరితోపాటు రిటైర్డ్ ఆర్మీ అధికారి కూడా భాగస్వామిగా ఉన్నాడు. వీరిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారులకు అలెగ్జాండ్రియా డీ మోరాయిస్ ఆదేశాలు జారీ చేశారు. 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ కుట్ర జరిగినట్లు తేలింది.