తాండూర్ : పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, పోడు భూములకు ( Podu Lands ) పట్టాలు ప్రభుత్వ వెంటనే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ ( Ashok ) , చేతి వృత్తిదారుల రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ కమిటీ హాల్లో గురువారం మండల వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభ దాగం రాజారాం అధ్యక్షతన నిర్వహించారు.
వారు మాట్లాడుతూ దేశంలో కొట్లాదిమంది తమ రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న పేదలకు ఉపాధి హామీ పథకం ఓ వరంలా మారిందని అన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి 60 శాతం నిధులు తగ్గించి అనేక రకాల పరీక్షల పేరిట నీరుగార్చే కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేద మహిళలకు రూ.2,500 నగదు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. నూతన పెన్షన్ పథకం అందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గోమాస అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేల్పుల శంకర్, కార్యదర్శి కొమ్మ కేతా, కమిటీ సభ్యులుగా యాకుబ్ ఖాన్, మున్నాబేగం, ఫర్విన్ బేగం, దుర్గం శ్రీలత, జేనేని లక్ష్మి, కందుకూల లలిత, సరితను ఎన్నుకున్నారు.