Canada Cricket : పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) ఆరోపణలతో వార్తల్లో నిలిచిన కెనడా క్రికెట్(Canada Cricket)లో మరో అలజడి మొదలైంది. అప్పుడు సెలెక్టర్లను బెదిరించిన గ్యాంగ్స్టర్లు.. ఈసారి ఏకంగా కొత్తగా ఎన్నికైన బోర్డు అధ్యక్షుడి నివాసంపై కాల్పులకు తెగబడ్డారు. ఇటీవలే కెనడా క్రికెట్ చీఫ్‌గా ఎంపికైన అర్విందర్ ఖోసా (Arvinder Khosa) ఇంటిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతిపై విచారణ జరుగుతున్న ఈ సమయంలో బోర్డు అధ్యక్షుడిని భయపెట్టాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిగినట్టు సమాచారం.
కెనడా క్రికెట్లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ఎంపికలో సెలెక్టర్లను భయపెట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ ఈసారి బోర్డు అధ్యక్షుడు అర్విందర్ ఖోసాను బెదిరించింది. బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఖోసా ఇంటిపై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఖోసాకు, అతడి కుటుంబసభ్యలుకు ఎలాంటి గాయాలవ్వలేదు. కానీ, తలుపు, కిటికీలు, గోడలపై ఐదు బుల్లెట్ రంధ్రాలు ఏర్పడ్డాయి.
BREAKING || Shots were fired at the Cricket Canada President’s home.
Authorities are looking into possible links with wider allegations involving match-fixing and organized crime networks in Canada: @aakaaanksha shares details.@bhavatoshsingh with more updates. pic.twitter.com/nveABTAf8p
— TIMES NOW (@TimesNow) May 21, 2026
కేసు నమోదు చేసిన సర్నే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, కెనడా క్రికెట్లో అవినీతిపై విచారణ జరుగుతున్న ఈ సమయంలో అధ్యక్షుడిని భయపెట్టి.. తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి పెంచాలని బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు తెగబడిందని తెలుస్తోంది.
భారత్, శ్రీలంక వేదికగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో కెనడా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని తెలిసింది. దిల్‌ప్రిత్ బజ్వా(Dilpreet Bajwa)ను కెప్టెన్‌గా నియమించడం నుంచి అతడికి అందరూ మద్దుతగా నిలవాలని, కొందరు ఆటగాళ్లను బెంచ్‌పై కూర్చోబెట్టొద్దని బిష్ణోయ్ బృందం సెలెక్టర్లను బెదిరించింది. ఒకవేళ ఎవరైనా బజ్వా మాట వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని సీబీసీ వార్త సంస్థ వెల్లడించింది.
క్రికెట్ కెనడా పనితీరు లోపాలను, జట్టు ఎంపిక, మ్యాచ్ ఫిక్సింగ్‌కు అవకాశముందనే అంశాలను తాజాగా ఓ డాక్యుమెంటరీ హైలెట్ చేసింది. ఇందుకు ఉదాహారణగా కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్‌ను పేర్కొంది. ప్రత్యర్ధికి 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన కెనడా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందని, కెప్టెన్ బజ్వా వేసిన ఓవర్లో నో బాల్, వైడ్ కలిపి 15 పరుగులివ్వడం ఫిక్సింగ్ అనుమానాలు రేకెత్తిస్తోందని డాక్యుమెంటరీ స్పష్టం చేసింది. అంతేకాదు కోచ్ ఖుర్రమ్ చోహన్ ఫోన్ రికార్డింగ్ లీకవ్వడం కూడా అవినీతి జరిగింది అనడానికి బలం చేకూరుస్తోంది.