France | రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఫ్రాన్స్ (France)లో తాజాగా నిరసనలు (Protest) చెలరేగాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బ్లాక్ ఎవ్రీథింగ్ (Block Everything) పేరుతో పెద్ద ఎత్తున వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆర్థిక, రాజకీయ సంక్షోభం, సమాజంలో నెలకొన్న అశాంతి కారణంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పారిస్ సహా ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు నిప్పు పెట్టారు (Vehicles Set On Fire). పశ్చిమ నగరమైన రెన్నెస్‌లో నిరసనకారులు ఓ బస్సును తగలబెట్టారు. రంగంలోకి దిగిన అధికారులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటి వరకూ దాదాపు 200 మందిని అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రి బ్రూనో రిటైల్లూ ప్రకటించారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మరోవైపు ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్నూ (Sebastien Le Cornouaille) నియమితులైన విషయం తెలిసిందే. విశ్వాసపరీక్షలో ప్రధాని బేరో ఓటమిపాలవటంతో రక్షణమంత్రిని కొత్త ప్రధానిగా ఎంపికచేశారు. ఏడాది వ్యవధిలో ఫ్రాన్స్‌లో ప్రధానిగా బాధ్యత చేపట్టిన నాలుగో వ్యక్తిగా లెకోర్నూ నిలిచారు. అంతకుముందు బేరో ప్రతిపాదించిన విశ్వాస పరీక్షలో ఆయనకు వ్యతిరేకంగా 364 ఓట్లు, అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. దీంతో రాజకీయ సంక్షోభం ముదరడంతో దేశాధ్యక్షుడు మాక్రాన్ రెండేండ్లలోపే అయిదో ప్రధానిని వెతకాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read..
Indian tourist | ఎటుచూసినా మంటలే.. సాయం చేయండి.. నేపాల్‌లో భారత పర్యాటకురాలు..!
India-Nepal Border | రగులుతున్న హిమాలయ దేశం.. నేపాల్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్