కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు పేలుడు కలకలం రేపింది. కాబూల్‌లోని ఓ మసీదు బయట భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 14 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈద్గా మసీదు ప్రవేశ ద్వారం వద్ద పేలుడు సంభవించడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఈ పేలుడు విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అయితే కొందరు ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఓ సూసైడ్ బాంబర్ మసీదు ఎంట్రెన్స్ వద్ద తనను తాను పేల్చుకుని దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.