ఇస్లామాబాద్: సింధూ జలాల ఒప్పందం కింద తమకు న్యాయబద్ధంగా రావలసిన వాటాను ఇవ్వని పక్షంలో భారత్‌పై తమ దేశం యుద్ధానికి వెళుతుందని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సోమవారం హెచ్చరించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి అనంతరం 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని భారత హోం మంత్రి అమిత్ షా గత వారం ప్రకటించారు.
అంతర్జాతీయ ఒప్పందాలను అమిత్ షా గౌరవించడం లేదని పాక్ విదేశాంగ శాఖ విమర్శించిన రెండు రోజులకే బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘భారత్‌కు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా మా వాటాను మాకు పంచడం లేదా ఆరు నదుల నుంచి మా వాటాను మేమే తీసుకోవడం’ అని బిలావల్ వ్యాఖ్యానించారు. సింధూ బేసిన్‌లోని ఆరు నదులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాల ఒప్పందం అమలులోనే ఉందని, సస్పెన్షన్‌లో ఉంచడం సాధ్యం కాదని చెప్పారు.