Bilawal Bhutto | ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ మరోసారి నిజాలు వెళ్లగక్కింది. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమేనంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) అంగీకరించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని స్వయంగా ఆ దేశ రక్షణమంత్రి (Pakistan defence minister) ఖవాజా ఆసిఫ్ (Khwaja M Asif) ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా బిలావల్ భుట్టో కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు.
రక్షణ మంత్రి చెప్పిన ప్రకారం.. పాక్‌కు గతం ఉందనేది రహస్యం కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దాని ఫలితంగా పాక్ చాలా నష్టపోయిందన్నారు. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిదని వ్యాఖ్యానించారు. అయితే, అది తమ దేశ చరిత్రలో ముగిసిన అధ్యాయమని.. ఒక దురదృష్ట భాగం అని పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం : పాక్ రక్షణ మంత్రి
ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు ఆ దేశ రక్షణమంత్రి (Pakistan defence minister) ఖవాజా ఆసిఫ్ (Khwaja M Asif) మీడియా సాక్షిగా ఒప్పుకున్న విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ‘స్కై న్యూస్’ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు సమాధానాలిచ్చారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటి అంశాలపై జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆయన అసలు విషయం బయటపెట్టారు.
‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం’ అని కుండ బద్దలు కొట్టారు. ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని తర్వాత అర్థమైనట్లు చెప్పారు. ఆ పనులు చేయడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే.. పాకిస్థాన్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ లేదని తెలిపారు. ‘లష్కరే అనేది పాత పేరు. అది ఇప్పుడు ఉనికిలో లేదు. దాని అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి నేను ఎప్పుడూ వినలేదు’ అని పేర్కొన్నారు.
Also Read..
Bilawal Bhutto : మా నీళ్లైనా పారాలి.. లేక మీ రక్తమైనా పారాలి: బిలావల్ భుట్టో వార్నింగ్
Pahalgam Terror Attack | ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు మా సంపూర్ణ మద్దతు : అమెరికా