ఇస్లామాబాద్: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో-జర్దారి(Bilawal Bhutto) ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత సర్కారు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని బిలావల్ ప్రస్తావించారు. సింధూ నదీ వ్యవహారంలో భారత ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గట్టిగా బదులిస్తామని బిలావల్ తెలిపారు. భారత్ తన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నట్లు ఆయన ఖండించారు. సింధూ జలాలు మావే అని, అవి ఎప్పటికీ మా నీళ్లే అని, ఆ నదిలో మా నీళ్లు అయినా పారాలి లేక మీ రక్తమైనా పారాలని అని బిలావల్ తన వార్నింగ్‌లో పేర్కొన్నారు.
సింధూ నదిపై కొత్తగా కెనాల్స్ నిర్మించే అంశం గురించి ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. పరస్పర అంగీకారం లేకుండా కెనాల్స్ నిర్మించరాదు అన్న అభిప్రాయాన్ని అక్కడ స్థానకి ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో సుకుర్లో జరిగిన బహిరంగ సభలో బిలావల్ భుట్టో ప్రసంగించారు. ఈ అంశంలో పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీల మధ్య అగ్రిమెంట్ కుదిరినట్లు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ఆమోదం లేకుండా సింధూ నదిపై కొత్తగా కాలువలు నిర్మించరాదు అని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.
సింధూ నదిపై మరోసారి దాడి జరుగుతోందని బిలావల్ ఆరోపించారు. ఈసారి భారత్ ఆ ప్రయత్నానికి ఒడి గట్టిందన్నారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌ను తప్పుగా ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తమ దేశం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు బిలావల్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో నదిని రక్షించుకునేందుకు, ఇండియాపై పోరాటం కొనసాగుతుందన్నారు. ఇండియా తన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు.