Bashar Al Assad | సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో దేశాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar Al Assad)కు మరో షాక్ తగిలింది. అసద్ నుంచి ఆయన భార్య అస్మా విడాకులు (Divorce) కోరినట్లు తెలిసింది.
తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అసద్ కుటుంబ సభ్యులతో కలిసి సిరియాను విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రష్యాలో (Russia) ఆశ్రయం పొందుతున్నారు. అయితే, రష్యాలో ఆశ్రయం పొందడం అసద్ భార్య అస్మాకు ఇష్టం లేదట. తన స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అసద్ నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. విడాకుల కోసం రష్యా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రష్యాను దాటి లండన్ వెళ్లిపోయేందుకు కోర్టును ప్రత్యేక అనుమతి కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె అభ్యర్థనను రష్యా అధికారులు పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అస్మా ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు 1975లో జన్మించారు. అక్కడే పుట్టి పెరిగారు. 2000 సంవత్సరంలో సిరియాకు వచ్చారు. అదే ఏడాది డిసెంబర్లో అసద్‌తో అస్మా వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఆ దేశ మొదటి మహిళగా కొనసాగుతున్నారు. అసద్ – అస్మా జంటకు ముగ్గురు సంతానం.
14 ఏండ్ల పాటు నిరంకుశ పాలన
సిరియా గత ఐదు దశాబ్దాలుగా బషర్ కుటుంబం చేతుల్లోనే ఉంది. 1971 నుంచి చనిపోయేంత వరకూ అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను పాలించారు. ఆ తర్వాత ఆయన మరణానంతరం అసద్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అసద్ వృత్తి రీత్యా డాక్టర్. ఆయనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఆయన పెద్ద సోదరుడు బషీర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని అనుకున్నారు. అయితే 1994లో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసద్ స్వదేశానికి వచ్చారు. 2000లో ఆయన తండ్రి హఫెజ్ అల్ అసద్ మరణించడంతో అసద్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. వాస్తవానికి అధ్యక్షుడిగా ఎంపికవ్వడానికి 40 ఏళ్ల వయసుండాలి. అయితే అసద్‌కు అప్పటికీ 34 ఏండ్లే కావడంతో చట్టాన్ని సడలించారు.
అసద్‌కు 2011 మార్చి నుంచి దేశంలో వ్యతిరేకత ప్రారంభమైంది. దీంతో అసమ్మతి గళాలను అణచివేయడానికి ఆయన తండ్రి బాటలో క్రూరమైన విధానాలను అనుసరించారు. ఇది అంతర్యుద్ధానికి దారితీసింది. సిరియా ప్రభుత్వంలో పౌరులపై జరుగుతున్న హింస, చట్టవిరుద్ధ హత్యలు, ప్రభుత్వం నిర్వహిస్తున్న నిర్బంధ కేంద్రాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యుద్ధం కారణంగా ఐదు లక్షల మంది మరణించగా, 23 మిలియన్ల జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు.
2015లో తిరుగుబాటుదారుల దూకుడుతో అసద్ అధికారం కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అయితే ఇరాన్‌తో పాటు లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, రష్యా వాయుసేన రంగంలోకి దిగి తిరుగుబాటుదారులపై దాడులు చేయడంతో వారు వెనక్కి తగ్గారు. తర్వాత ఐసిస్ ప్రాబల్యం పెరిగింది. దీనిపై అమెరికా స్పందించి వాటిని తుడిచిపెట్టేసింది. తర్వాత వేర్పాటు వాదులు తిరిగి పుంజుకుని దేశాన్ని ఆక్రమించుకోవడంతో 60 శాతం సిరియా భూభాగాన్ని మాత్రమే అసద్ పాలించారు. సొంత ప్రజలపైనే రసాయన దాడులు, సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని అసద్ మూటకట్టుకున్నారు. ఆయన ఆర్థిక విధానాలు దేశానికి నష్టం కలిగించాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రజాస్వామ్యం కోసం 2011లోనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే వీటిని బషర్ ఉక్కుపాదంతో అణచివేశారు.
ఇటీవలే ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సిరియాకు సహాయం అందించిన రష్యా.. ఉక్రెయిన్ యుద్ధంతో తలమునకలై ఉండటం, ఇరాన్, హెజ్బొల్లాలు కూడా ఇజ్రాయెల్‌తో తలపడుతూ ఉండటం వల్ల సిరియాను పట్టించుకునే వారే కరవయ్యారు. దీంతో ఇదే అదనుగా ఇటీవల తిరుగుబాటుదారులు మళ్లీ విజృంభించడం ప్రారంభించారు. అబు మహ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హయాత్ తహరీర్ అల్ షమ్ (హెచ్‌టీఎస్) ఇటీవల తిరిగి తిరుగుబాటు ప్రారంభించి అసద్ పాలనకు ముగింపపు పలికింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ నెల 8వ తేదీన రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు. ‘ఈ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నాం.. సిరియాలొ కొత్త శకం ప్రారంభమైంది. విదేశాల్లో ఉన్న సిరియన్లు స్వేచ్ఛగా రావచ్చు’ అని తిరుగుబాటుదారులు ప్రకటించారు.
Also Read..
“Syria | అసద్‌కు రష్యా ఆశ్రయం.. మహిళలకు డ్రెస్ కోడ్ విధించబోమన్న సిరియా రెబల్స్”
“Syria | ముగిసిన అసద్ శకం.. సిరియా రెబల్స్ వశం”
“సిరియాలో గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్”
“ఇజ్రాయెల్ దాడుల్లో సిరియన్ బంకర్లు ధ్వంసం”
“Syria | సిరియాలో మళ్లీ సంక్షోభం.. ఇస్లామిక్ రెబల్స్ భీకర దాడులు”
“Syria | సిరియా శ్మశానంలో లక్ష మృతదేహాలు”