పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. ఆదివారం రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు. ఆయన ఆచూకీ తెలియడం లేదు. అయితే ఆయన విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దాదాపు 50 ఏండ్లుగా ఉక్కు పిడికిలితో దేశాన్ని పాలిస్తున్న అసద్ కుటుంబ పాలన ముగియడంతో దేశంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కొందరు అధ్యక్ష భవనంలోకి చొరబడి.. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. దేశంలో నవశకం ప్రారంభమైందని తిరుగుబాటుదారులు ప్రకటించారు.
Syria | డమాస్కస్, డిసెంబర్ 8: పశ్చిమాసియా దేశమైన సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. ఆదివారం రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయారు. ఆయన ఆచూకీ తెలియడం లేదు. అయితే అసద్ పారిపోతున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్టు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్ 76 విమానాన్ని లెబనాన్ గగనతల పరిధిలో కూల్చివేసినట్టు పేర్కొంటున్నా, దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తన పూర్తి సహకారం అందిస్తానని సిరియా ప్రధాని మహమ్మద్ ఘాజీ-జలాలి ప్రకటించారు. ‘ఈ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నాం.. సిరియాలొ కొత్త శకం ప్రారంభమైంది.
విదేశాల్లో ఉన్న సిరియన్లు స్వేచ్ఛగా రావచ్చు’ అని తిరుగుబాటుదారులు ప్రకటించారు. 55 ఏండ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో పౌరులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అధ్యక్షుడు బషర్ అసద్ పదవీచ్యుతుడయ్యారని, ఖైదీలను విడుదల చేస్తున్నామని కొంతమంది వీడియో ప్రకటన విడుదల చేసినట్టు సిరియన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. తర్వాత కొద్ది సేపటికి అసద్ దేశాన్ని వదిలి గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయారని ప్రకటించింది. ఇప్పటివరకు సిరియాకు సహాయం అందించిన రష్యా.. ఉక్రెయిన్ యుద్ధంతో తలమునకలై ఉండటం, ఇరాన్, హెజ్బొల్లాలు కూడా ఇజ్రాయెల్‌తో తలపడుతూ ఉండటం వల్ల సిరియాను పట్టించుకునే వారే కరవయ్యారు. దీంతో ఇదే అదనుగా ఇటీవల తిరుగుబాటుదారులు మళ్లీ విజృంభించడం ప్రారంభించారు. అబు మహ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హయాత్ తహరీర్ అల్ షమ్ (హెచ్‌టీఎస్) ఇటీవల తిరిగి తిరుగుబాటు ప్రారంభించి అసద్ పాలనకు ముగింపపు పలికింది.
అంతర్యుద్ధం ఉన్నా, 14 ఏండ్ల పాటు నిరంకుశ పాలన సాగించిన అసద్ పదవి నుంచి దిగిపోయిన విషయాన్ని ప్రజలు తొలుత నమ్మలేకపోయారు. కొద్ది సేపటికి రాజధాని అంతటా సంబరాలతో నిండిపోయింది. మసీదులలో ప్రార్థనలతో పాటు, ఉమయ్యద్ స్క్వేర్‌లో వేలాది మంది సంబరాలు జరుపుకున్నారు. అసద్ వ్యతిరేక నినాదాలు చేస్తూ, జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు చేసుకున్నారు. కొందరు అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి ఖరీదైన సామగ్రిని అపహరించుకుపోయారు. అసద్ తండ్రి విగ్రహంతో పాటు ఆస్తులు, అధికార చిహ్నాలను వారు ధ్వంసం చేశారు.
సిరియా అధ్యక్షుడు అసద్ వృత్తి రీత్యా డాక్టర్. ఆయనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఆయన పెద్ద సోదరుడు బషీర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని అనుకున్నారు. అయితే 1994లో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసద్ స్వదేశానికి వచ్చారు. 2000లో ఆయన తండ్రి హఫెజ్ అల్ అసద్ మరణించడంతో అసద్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. వాస్తవానికి అధ్యక్షుడిగా ఎంపికవ్వడానికి 40 ఏళ్ల వయసుండాలి. అయితే అసద్‌కు అప్పటికీ 34 ఏండ్లే కావడంతో చట్టాన్ని సడలించారు. అసద్‌కు 2011 మార్చి నుంచి దేశంలో వ్యతిరేకత ప్రారంభమైంది. దీంతో అసమ్మతి గళాలను అణచివేయడానికి ఆయన తండ్రి బాటలో క్రూరమైన విధానాలను అనుసరించారు. ఇది అంతర్యుద్ధానికి దారితీసింది. సిరియా ప్రభుత్వంలో పౌరులపై జరుగుతున్న హింస, చట్టవిరుద్ధ హత్యలు, ప్రభుత్వం నిర్వహిస్తున్న నిర్బంధ కేంద్రాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. యుద్ధం కారణంగా ఐదు లక్షల మంది మరణించగా, 23 మిలియన్ల జనాభాలో సగం మంది నిరాశ్రయులయ్యారు.
2015లో తిరుగుబాటుదారుల దూకుడుతో అసద్ అధికారం కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అయితే ఇరాన్‌తో పాటు లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, రష్యా వాయుసేన రంగంలోకి దిగి తిరుగుబాటుదారులపై దాడులు చేయడంతో వారు వెనక్కి తగ్గారు. తర్వాత ఐసిస్ ప్రాబల్యం పెరిగింది. దీనిపై అమెరికా స్పందించి వాటిని తుడిచిపెట్టేసింది. తర్వాత వేర్పాటు వాదులు తిరిగి పుంజుకుని దేశాన్ని ఆక్రమించుకోవడంతో 60 శాతం సిరియా భూభాగాన్ని మాత్రమే అసద్ పాలించారు. సొంత ప్రజలపైనే రసాయన దాడులు, సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని అసద్ మూటకట్టుకున్నారు. ఆయన ఆర్థిక విధానాలు దేశానికి నష్టం కలిగించాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రజాస్వామ్యం కోసం 2011లోనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే వీటిని బషర్ ఉక్కుపాదంతో అణచివేశారు.
హయాత్ తహరీర్ అల్ షమ్ (హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటు దళాలకు సారథ్యం వహించి అసద్‌ను గద్దెదించిన అబు మహ్మద్ అల్ జులానీపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసే హెచ్‌టీఎస్‌కు నేతృత్వం వహిస్తున్న జులానీ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అయితే జులానీ అసలు పేరేంటి, అతను ఏ ప్రాంతం వాడన్నది ఇప్పటికే మిస్టరీయే. జులానీ 2003లో అల్ ఖైదాలో చేరాడు. 2016లో సిరియాలోని ఐఎస్ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు ఆయనను సిరియాకు పంపారు. అక్కడ ఆయన ఐసిస్‌తో రహస్య సంబంధాలున్న నుస్రా ఫ్రంట్‌కు కమాండర్‌గా ఎదిగాడు. తర్వాత తాను అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా నుంచి వేరుపడినట్టు ప్రకటించాడు. హెచ్‌టీఎస్ ఆవిర్భవానికి వీలుగా 2017లో తన ఫైటర్ గ్రూప్‌ను మిగిలిన సిరియా రెబల్ గ్రూప్‌లతో విలీనం చేస్తున్నట్టు చెప్పాడు. అనంతరం ఈ హెచ్‌టీఎస్ గ్రూపే సిరియాలో ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ, చివరకు అసద్‌ను దేశం విడిచి పారిపోయేలా చేసింది.
సిరియా ప్రస్తుత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. ఇప్పటివరకు నిరంకుశ పాలనలో నలిగిపోయిన ప్రజలు భవిష్యత్తులో అతివాదుల పాలన ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అసద్ పాలన అంతమైనంత మాత్రాన అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్న హెచ్టీఎస్తో ఇక్కడ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని ఎవరూ ఆశించడం లేదు. అంతర్యుద్ధం కారణంగా, పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలు దాదాపు 70 శాతం శిథిలమయ్యాయి. వాటిని పునర్నిర్మించాలంటే వేల కోట్లు అవసరం. కొత్తగా అధికారంలోకి వచ్చే వారు జాతుల ఘర్షణను నివారించాల్సి ఉంది. అతివాదులు అధికారంలోకి వస్తే పశ్చిమ దేశాలు అంతగా సహకరించవు. అరబ్ దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా సిరియాకు చేయూతనివ్వాలి. అయితే ఇది అంత సులభంగా జరుగుతుందని భావించలేం.