టెల్ అవీవ్: ఒక పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుడిని వెళ్లగొట్టి దేశాన్ని ఆక్రమించుకోగా, మరో పక్క సిరియా దేశం ఆధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఐదు గ్రామాలున్న ఇది ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతానికి దగ్గరగా ఉంది. గోలన్ హైట్స్‌లోని బఫర్‌జోన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తన సైన్యాన్ని ఆదేశించారు. 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకుని తనలో కలిపేసుకుంది.
ఒక్క అమెరికా తప్ప ప్రపంచంలోని దేశాలన్నీ దానిని అన్యాయంగా ఆక్రమించాయని ఆరోపించాయి. తర్వాత దాని స్వాధీనానికి సిరియా చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. దీంతో గోలన్ హైట్స్‌పై 1974లో సిరియాతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని బఫర్ జోన్‌గా ప్రకటించాయి. అయితే తాజాగా సిరియా అధ్యక్షుడి నిష్క్రమణతో ఈ ఒప్పందం రద్దయిందని ఆదివారం నెతన్యాహూ ప్రకటించారు. దానిని ఇజ్రాయెల్ స్వాధీనానికి వీలుగా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సిరియా సైనికులు వదిలి వెళ్లారన్నారు.