Syria | డమాస్కస్: సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో దేశాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్‌కు రష్యా రాజకీయ ఆశ్రయం కల్పించింది. అసద్, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లారన్న దానిపై వస్తున్న ఊహాగానాలపై సోమవారం రష్యా స్పష్టతనిచ్చింది. అసద్‌కు ఆశ్రయం కల్పించటంపై అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. అధ్యక్షుడు పుతిన్, అసద్‌కు మధ్య భేటీ జరిగే అవకాశం లేదని అన్నారు. ఏ ప్రదేశంలో అసద్, ఆయన కుటుంబ సభ్యులు ఆశ్రయం పొందారన్న వివరాలు వెల్లడించడానికి ‘క్రెమ్లిన్’ నిరాకరించింది. ఇదిలా ఉండగా, సిరియాను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న రెబల్స్ తాజాగా కీలక ప్రకటన చేశారు. సిరియాలో మహిళలకు మతపరమైన డ్రెస్ కోడ్ విధించబోమని, దేశంలో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛలో కలుగజేసుకోమని రెబల్స్ స్పష్టం చేశారు.
అధ్యక్షుడి నివాసానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. ఓ వీడియోలో మాజీ అధ్యక్షుడి ‘ఫ్యామిలీ బంకర్’ దృశ్యాలు బయటకొచ్చాయి. అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేట్ గ్యారేజీలో కోట్ల రూపాయల విలువైన పోర్ష్, లాంబోర్గిని, ఫెరారీ, మెర్సిడెజ్-బెంజ్, ఆడీ వంటి ఖరీదైన కార్లు ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆందోళనకారులు అసద్ ఇంట్లోని రహస్య సొరంగ మార్గాన్ని గుర్తించారని, అందులో బంగారు ఆభరణాలు, ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అధ్యక్షుడి నివాసం లోపల భారీ సొరంగం, దాని చివర్లో చెల్లాచెదురుగా పడి వున్న పెట్టెలు, వస్తువులు కనిపిస్తున్నాయి.
సిరియాలో చోటుచేసుకున్న పరిణామాల్ని ఆహ్వానించిన ఇజ్రాయెల్.. ఆ దేశంలో అనుమానిత రసాయన ఆయుధాలు, దీర్ఘశ్రేణి రాకెట్ల కేంద్రాలపై వైమానిక దాడులు నిర్వహించింది. రసాయన ఆయుధాలు, రాకెట్లు తీవ్రవాదుల చేతుల్లో పడకూడదన్న ఉద్దేశంతో ఈ దాడులు జరిపినట్టు ఆ దేశం చెప్పింది.
సిరియా అసద్ నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొందడంతో విదేశాలకు శరణార్థులుగా తరలివెళ్లిన వారు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఫ్రాన్స్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో సిరియన్లు ఆ దేశ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. తమకు స్వాతంత్య్రం వచ్చిందని, ఈ రోజు కోసమే తాము 14 ఏండ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు. సిరియాలో నియంతృత్వ పాలన కారణంగా దాదాపు 70 కోట్ల మంది సిరియన్లు దేశం విడిచారు.