Bangladesh | మాజీ ప్రధాని షేక్ హసీనా విధేయులపై ఉక్కుపాదం మోపుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం ‘డెవిల్ హంట్’ పేరుతో భద్రతా ఆపరేషన్ (Operation Devil Hunt) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఆర్మీ, పోలీసులు, ప్రత్యేక భద్రతా యూనిట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఈ జాయింట్ ఫోర్స్ ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ పేరుతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1300 మందిని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని యూనస్ సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ తెలిపారు.
ఇదిలా ఉండగా.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం బంగ బంధుగా పేరు పొందిన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ (Sheikh Mujibur Rahman) చారిత్రక నివాసంపై మూక దాడి జరిగింది. దుండగులు ఈ బంగళాకు నిప్పు పెట్టి, విధ్వంసం సృష్టించారు. పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజ్‌లో భావోద్వేగంతో స్పందించారు. బంగళాను తుడిచిపెట్టేసినప్పటికీ, తన తండ్రి చరిత్ర ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోదని స్పష్టం చేశారు. ఓ ఇంటిని చూసి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. గతంలో ఈ ఇంటికి నిప్పు పెట్టారని, ఇప్పుడు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఆవేదన చెందారు.
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ డెవిల్ హంట్.. హసీనా విధేయులపై ప్రభుత్వం ఉక్కుపాదం
Donald Trump | ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఆ దిగుమతులపై 25 % టారిఫ్‌లు
Supersonic Aircraft | సూపర్ సానిక్ విమానాల పునరాగమనం?.. ఆ సమస్యలను అధిగమించేనా?