Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్లను సవరించాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమె రాజీనామా చేయకతప్పలేదు. ఆదివారం ఒక్కరోజు చెలరేగిన అల్లర్లతోనే దేశవ్యాప్తంగా 72 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.
ఇవాళ ఆందోళనకారులు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో షేక్ హసీనా భారత్‌కు బయలుదేరినట్లు సమాచారం. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆమె పశ్చిమబెంగాల్‌కు వస్తున్నట్లు తెలిసింది. ఢాకా ప్యాలెస్ నుంచి హసీనా ఆర్మీ హెలికాప్టర్లో భారత్ బయలుదేరినట్లు సమాచారం.
కాగా, గడిచిన 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్ హసీనాకు తాజా ఆందోళనలు సవాలుగా మారాయి. రాజధాని రోడ్లపై నిరసనకారులు ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. రాజధానిని జిల్లాలకు కలిపే మార్గాలన్నింటిని మూసేశారు. సిరాజ్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఆందోళనకారుల దాడిలో ఏకంగా 13 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు.