ఇస్లామాబాద్ : కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతో పాటు నలుగురు మరణించిన ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పేర్కొంది. చైనా పౌరులు, డ్రాగన్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్ గ్రూప్ బీఎల్ఏ కార్యకలాపాలు సాగిస్తోంది. మహిళా సూసైడ్ బాంబర్ ఈ దాడికి పాల్పడిందని బీఎల్ఏ పేర్కొంది.
సూసైడ్ బాంబర్‌ను షరి బలూచ్గా గుర్తించినట్టు ఓ ప్రకటనలో బీఎల్ఏ పేర్కొంది. షరి మిలిటెంట్ గ్రూప్‌లో తొలి మహిళా బాంబర్ అని వెల్లడించింది. బలూచ్ ప్రతిఘటన చరిత్రలోనే ఈ దాడి నూతన అధ్యాయంగా మిగిలిపోతుందని పేర్కొంది.
జులై 2021లో దసు ప్రాంతంలో బస్‌పై జరిగిన దాడిలో తొమ్మిది మంది చైనీయులు మరణించిన తర్వాత చైనా పౌరులు లక్ష్యంగా పాకిస్తాన్లో భారీ దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ దాడి తాము చేపట్టలేదని అప్పట్లో బలూచ్ మిలిటెంట్లు ప్రకటించగా ఈ దాడి తమ పనేనని తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్‌గా పేరొందిన పాకిస్తాని తాలిబన్ సంస్ధ వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు పాకిస్తానీలూ మరణించారు.