India-Russia Ties | రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే భారత్‌పై అధిక సుంకాలు బాదిన ట్రంప్ (Trump Tariffs).. ఈయూ, జీ-7 దేశాలపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. భారత్ దిగుమతులపై అమెరికా తరహాలోనే అధిక సుంకాలు విధించాలని ఆయా దేశాలకు సూచిస్తున్నారు. ఇందుకు జీ-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాకు కౌంటర్ ఇచ్చింది.
అమెరికా తరహాలోనే ఇతర దేశాలు కూడా భారత్‌పై టారిఫ్‌లు విధించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఢిల్లీతో తమ సంబంధం (India-Russia Ties) స్థిరంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ-మాస్కో మధ్య సంబంధాలు స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాయి. దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవడం ఖాయం. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్‌ను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా, ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది’ అని రష్యా విదేశాంగ శాఖ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది.
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తున్నది. ఇందులో భాగంగానే రష్యా మిత్ర దేశమైన భారత్‌పై భారీగా సుంకాలు విధించటం ద్వారా ఒకరకంగా మాస్కోపై చర్యలు తీసుకున్నట్టేనని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో ఈయూ, జీ-7 దేశాలు భారత్, చైనాలపై సుంకాలు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు జీ-7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.
Also Read..
Donald Trump | ఖతార్ విషయంలో జాగ్రత్త.. అది మాకు మిత్రదేశం.. నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్
లష్కరే ఆఫీస్ పునర్నిర్మాణానికి పాక్ నిధులు!