వాషింగ్టన్: ఏడు ప్రపంచ యుద్ధాలను ఆపిన తర్వాత కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదని, ఇది దేశానికే అవమానకరమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం వ్యాఖ్యానించారు. క్వాంటికోలో ఉన్నతస్థాయి జనరల్స్, అడ్మిరల్స్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఏమీ చేయని ఎవరో ఒక వ్యక్తికి ఆ నోబెల్ ఇస్తారు. ట్రంప్ మేధస్సు, యుద్ధాలు ఆపడానికి అది చేసిన కృషి గురించి పుస్తకం రాసిన వ్యక్తికి నోబెల్ ఇస్తారు. నోబెల్ బహుమతి ఓ రచయితకు ఇస్తారే కాని యుద్ధాలు ఆపిన ట్రంప్‌కి ఇవ్వరు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే నోబెల్ బహుమతి నాకు రాకపోవడం దేశానికే ఘోర అవమానం. నాకోసం అడగడం లేదు. దేశానికి అది దక్కాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన కృషి ఎవరూ ఎక్కడా చేయనిది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
నెతన్యాహుతో ట్రంప్ బలవంతపు క్షమాపణ? ; వైట్ హౌస్ ఫొటోలపై సర్వత్రా చర్చ
ఖతార్ ప్రధానికి క్షమాపణ చెప్పే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్రిప్టు చూస్తూ చదివారా? ట్రంప్ తన ఒడిలో టెలిఫోన్ పెట్టుకోగా కాగితంలోని స్క్రిప్టును నెతన్యాహు చదువుతూ ఫోన్లో మాట్లాడుతున్న ఫొటోలను వైట్ హౌస్ విడుదల చేయడంతో ఈ సందేహం తలెత్తింది. సోమవారం ఓవల్ ఆఫీసులో తీసిన ఈ ఫొటోను బట్టి చూస్తే ఖతార్ ప్రధానితో నెతన్యాహు ఫోన్లో మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. ట్రంప్ ఒత్తిడి మేరకే నెతన్యాహు ఖతార్ ప్రధానికి ఫోన్ చేసి దోహాలో హమాస్ నేతలపై దాడికి ఆదేశించినందుకు క్షమాపణ కోరినట్లు వైట్ హౌస్ తెలిపింది.