న్యూఢిల్లీ, అక్టోబర్ 1: నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ కోసం కొత్తగా ఇంటెగ్రిటీ వీసా ఫీజును అమెరికా ప్రవేశపెట్టింది. ఈ ఫీజు ఎఫ్-1, ఎఫ్-2 వీసాలు, జే-1, జే-2 వీసాలు, హెచ్-1బీ, హెచ్-4 వీసాలతోపాటు టూరిస్టు-బీ-1/బీ-2 తదితర వీసాలకు వర్తిస్తుంది. వీసా ఇంటెగ్రిటీ ఫీజు తప్పనిసరి. దీన్ని రద్దు చేయడం లేదా తగ్గించడం కుదరదు. అయితే వీసా నిబంధనలను పూర్తిగా పాటించిన దరఖాస్తుదారులకు ఈ ఫీజును ప్రభుత్వం వాపసు చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరం కోసం ఇంటెగ్రిటీ ఫీజు సుమారు 250 డాలర్లు(రూ. 22 వేలు) లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) నిర్ణయించిన మేరకు ఉండనుంది.
అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ ; ఆరేండ్ల తర్వాత తొలిసారి
న్యూఢిల్లీ: అమెరికా సంయుక్త రాష్ర్టాల ప్రభుత్వం మరోసారి మూతపడింది. గత ఆరేండ్లలో తొలిసారిగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి నిధులు సమకూర్చే బిల్లును సెనేట్‌లో ఆమోదించడానికి జరిగిన చివరి ప్రయత్నం విఫలమవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన నిధుల బిల్లుకు అనుకూలంగా కేవలం 55-45 ఓట్లు మాత్రమే పడ్డాయి. బిల్లును ఆమోదించడానికి అవసరమైన 60 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. ఆరోగ్య సంరక్షణ చట్టం కింద అందించే రాయితీలే ప్రభుత్వ షట్డౌన్కు ప్రధాన కారణం. కొవిడ్-19 సమయంలో పెంచిన ఈ రాయితీలు ఈ ఏడాది చివర్లో ముగుస్తున్నాయి. ఈ రాయితీలను వెంటనే పొడిగించాలని డెమొక్రాట్స్ డిమాండ్ చేస్తున్నారు.