e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home Top Slides ‘పిజ్జా’ డ్రోన్లతో దాడి!

‘పిజ్జా’ డ్రోన్లతో దాడి!

  • జమ్ము ఘటనలో కొత్త కోణం..
  • పిజ్జాలు, ఔషధాల సరఫరా కోసం చైనానుంచి భారీగా డ్రోన్లను కొన్న పాక్‌
  • వీటితోనే దాడి జరిపిన ఉగ్రవాదులు!
  • భద్రతాదళాలకు లభించిన సమాచారం
  • డ్రోన్‌ దాడి దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత
  • రాజ్‌నాథ్‌, అమిత్‌షాతో ప్రధాని భేటీ
  • మూడోరోజూ జమ్ములో డ్రోన్ల సంచారం

న్యూఢిల్లీ, జూన్‌ 29: పిజ్జాలను కస్టమర్లకు అందజేయటానికి ఉపయోగించే డ్రోన్ల ద్వారా పాక్‌ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడ్డారా? ఇటీవల చైనా నుంచి పాకిస్థాన్‌ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినట్టు నిఘా వర్గాల నుంచి భారత భద్రతా సంస్థలకు సమాచారం అందింది. వీటిని పిజ్జాలు, ఔషధాల సరఫరా కోసం వాడనున్నట్లుగా పాక్‌ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డ్రోన్లనే జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడికి పాక్‌ ఉగ్రవాదులు ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, ‘డ్రోన్‌ దాడి’ కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. దేశంలోనే తొలిసారిగా ఆదివారం వేకువజామున 1.40 గంటల సమయంలో ఆరు నిమిషాల వ్యవధిలో రెండు డ్రోన్‌ దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై ఎన్‌ఐఏకి చెందిన ప్రత్యేక స్కాడ్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్‌ బాంబులు వాడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రోన్‌ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్‌ నుంచే డ్రోన్లు వచ్చి ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైమానిక స్థావరం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

లష్కరే తాయిబా హస్తం
వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి వెనుక నిషేధిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు. పాకిస్థాన్‌ నుంచే డ్రోన్లు వచ్చి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. పౌర అవసరాలకు కూడా అనుమతి లేకుండా డ్రోన్లను వినియోగించొద్దని ప్రజలకు సూచించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

ప్రధాని సమావేశం
జమ్ములో డ్రోన్‌ దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోం మంత్రి అమిత్‌తోపాటు జాతీయభద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే భద్రతా ముప్పులు, సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర విధానాన్ని వేగవంతంగా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇందులో భాగం కానున్నాయి. ముఖ్యంగా రక్షణ శాఖ, త్రివిధ దళాలు ఈ పాలసీ రూపకల్పన, అమలులో కీలకపాత్ర పోషించనున్నాయి. డ్రోన్‌ వంటి దాడులను ఎదుర్కొనేందుకు బలగాలకు అధునాతన ఆయుధ సామగ్రిని సమకూర్చడంపైనా సమావేశంలో చర్చించారు.

మళ్లీ కనిపించిన డ్రోన్లు
వరుసగా మూడో రోజు కూడా జమ్ములో డ్రోన్లు కలకలం సృష్టించాయి. రత్నుచక్‌, కుంజవానీ ప్రాంతంలో మూడుసార్లు డ్రోన్లు కనిపించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమవారం కూడా కాలూచక్‌-రత్నుచక్‌ ప్రాంతంలోని వైమానిక శిబిరాల వద్ద డ్రోన్లు చక్కర్లు కొట్టగా సైనికులు కాల్పులు జరుపడంతో అవి వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే.

ఐరాసలో భారత్‌ ఆందోళన
వ్యూహాత్మక ప్రదేశాలపై, వాణిజ్యపరమైన ఆస్తులపై ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడుతుండటం మీద ప్రపంచ దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని ఐరాస సాధారణ అసెంబ్లీలో భారత్‌ పేర్కొన్నది. ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తి.. కొత్త పేమెంట్‌ విధానాలు, క్రౌడ్‌ ఫండింగ్‌తో ఉగ్రవాదులకు నిధుల చేరవేత వంటివి ఇప్పటికే పెను సవాళ్లు విసురుతున్నాయని, తాజాగా డ్రోన్ల రూపంలో మరో ముప్పు ముంచుకొస్తున్నదని కేంద్ర హోంశాఖకు చెందిన ప్రత్యేక కార్యదర్శి వీఎస్‌కే కౌముది పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana