కాంగో : కాంగోలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నార్త్ కివూ ప్రావిన్స్‌లోని బెనీ నగరంలోని ఓ బార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చాలా మంది క్రిస్టియన్లు బెనీలోని బార్‌కు వచ్చారు.
రాత్రి 7 గంటల సమయంలో బార్ వద్ద ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేయడంతో.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఆత్మాహుతి దాడి జరగడంతో అక్కడ్నుంచి తప్పించుకునేందుకు చాలా మంది పరుగులు తీశారు. కొందరు అక్కడే చిక్కుకున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిని కాంగో ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గతంలోనూ బెనీ నగరంలో పలుమార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయి.