Donald Trump | చికాగో, జూలై 14: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్(78) మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే స్పందించడంతో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ప్రచార సభకు హాజరైన ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్ ఒకరు కాల్చి చంపేశారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ అసాధారణ ఘటన అమెరికాను కుదిపేస్తున్నది.
రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి పోటీ చేస్తున్న ట్రంప్ శనివారం బట్లర్‌లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. సాయంత్రం 6:15 గంటల సమయంలో తన మద్దతుదారుల మధ్యలో ఆయన ప్రసంగం ప్రారంభిస్తుండగా.. సమీపంలోని ఓ రేకుల నిర్మాణంపై నక్కిన దుండగుడు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ దుసుకెళ్లింది. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ఆయన పోడియం వెనుక మోకాళ్లపై కుర్చున్నారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి ఆయనను వేదిక కిందకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమై రక్తస్రావమైంది. ఆయన ముఖంపై రక్తపు ధారలు కారుతుండగానే.. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ట్రంప్ అభివాదం చేశారు. పిడికిలి బిగించి, ‘ఫైట్, ఫైట్, ఫైట్’ అని నినదించారు. వెంటనే ట్రంప్‌ను పిట్స్బర్గ్ ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో సభకు హాజరైన ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారు.
దుండగుడిని బెథెల్ పార్క్‌కు చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్(20)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అమెరికా ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. దుండగుడు సభా ప్రాంగణంలోకి తుపాకీని ఎలా తీసుకెళ్లగలిగాడు, ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనేది తేలాల్సి ఉందని ఎఫ్‌బీఐ పిట్స్బర్గ్ ప్రాంత స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ తెలిపారు. అతడి గురించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు చెప్పినా పట్టించుకోలేదని ఓ ప్రత్యక్ష సాక్షి ఆరోపించాడు.
ట్రంప్‌పై కాల్పులు జరిపినట్టుగా భావిస్తున్న థామస్ మాథ్యూ క్రూక్స్ ఎవరనే అంశంపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతున్నది. అతడు రిపబ్లికన్ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, 2021లో డెమొక్రటిక్ పార్టీ అనుబంధ ప్రోగ్రెసివ్ టర్న్‌ఔట్ ప్రాజెక్ట్‌కు కూడా క్రూక్ 15 డాలర్లు విరాళంగా ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతున్నది. కాగా, క్రూక్స్ ఇంట్లో, కారులో బాంబు తయారీ ముడిపదార్థాలను భద్రతా సిబ్బంది గుర్తించారు.
కాల్పుల ఘటనపై ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. ‘మన దేశంలో ఇలాంటి ఘటన జరగడాన్ని నమ్మలేకపోతున్నా. నన్ను కాల్చిన ఒక బుల్లెట్ నా కుడి చెవి పైభాగాన్ని తాకింది. బుల్లెట్ శబ్ధం విని ఏదో జరుగుతున్నది అని అనుకుంటుండగానే నాకు బుల్లెట్ తగిలింది. తీవ్ర రక్తస్రావం అయ్యింది. అప్పుడు నాకు ఏం జరిగిందో అర్థమైంది. గాడ్ బ్లెస్ అమెరికా’ అంటూ ఆయన పేర్కొన్నారు. తర్వాత ఆయన మరోసారి స్పందిస్తూ.. ‘ఊహించని పరిణామం నుంచి ఆ దేవుడే కాపాడాడు. ఈ సమయంలో అమెరికన్లు ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. మన అసలైన స్వభావాన్ని చాటి, చెడు గెలవకుండా చూడాలి’ అని పిలుపునిచ్చారు. ఆటుపోట్లను తట్టుకుంటామన్నారు.
ట్రంప్‌పై హత్యాయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషమని, ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ట్రంప్‌ను రక్షించిన సీక్రెట్ సర్వీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని, దేశమంతా ఐక్యంగా ఈ ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌తోనూ బైడెన్ ఫోన్లో మాట్లాడారని వైట్ హౌజ్ అధికారి చెప్పారు.
తన స్నేహితుడు ట్రంప్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యాల్లో హింసకు చోటు లేదని, ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వివిధ దేశాధి నేతలు కూడా దాడిని ఖండించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన రాజకీయాలను మలుపుతిప్పే అవకాశం ఉందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన తర్వాత ట్రంప్ విజయావకాశాలు పెరిగినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ విజయావకాశాలు ఒకేసారి 8% పెరిగి, 70 శాతానికి చేరుకున్నట్టు రాజకీయాలను అంచనా వేసే పాలిమార్కెట్ అనే సంస్థ పేర్కొన్నది.
ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన రెండు గంటలకే ఆయన పిడికిలి బిగించి నినదిస్తున్న ఫొటోలతో కూడిన టీ-షర్టులు చైనాలో అమ్మకానికి ఉంచారు. చైనా, అమెరికా నుంచి ఈ టీ షర్టుల కొనుగోలుకు భారీగా ఆర్డర్లు రావడం గమనార్హం.