చెన్నై, సెప్టెంబర్ 2 : భారత్, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కచ్చతీవు వివాదం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళనాడులో రాజకీయ చిచ్చు రగిల్చింది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల భావోద్వేగంతో ముడిపడిన ఈ భూవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జాఫ్నా చేరుకున్న దిసనాయకే కచ్చతీవుపై తమ సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కచ్చతీవును భారత్కు అప్పగించే విషయంపై చర్చలు జరపబోమని కూడా ఆయన చెప్పారు. దిసనాయకే నేవీ గస్తీ పడవలో జాఫ్నా నుంచి కచ్చతీవు ద్వీపాన్ని చేరుకున్నారు.