Dissanayake | కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతానికిపైగా ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి ఈ ఫలితాన్ని ప్రకటించారు. దిస్సనాయకే మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత. మరికొన్ని పార్టీలతో కలిసి నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. సమగి జన బలవేగయ (ఎస్జేబీ) నేత సాజిత్ ప్రేమదాసపై దిసనాయకే గెలిచారు. శ్రీలంక అధ్యక్షునిగా దిసనాయకే సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్పీపీ ప్రకటించింది. “ప్రెసిడెంట్ అనుర దిసనాయకే, ప్రియమైన బిడ్డ శ్రీలంకను మీ సంరక్షణకు అప్పగిస్తున్నాను” అని దిసనాయకేను ఉద్దేశించి విక్రమసింఘే ఒక ప్రకటనలోతెలిపారు.
శ్రీలంక రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన అనుర కుమార దిసనాయకే డిగ్రీ చదువుతున్నప్పుడు సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి, విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీలో చేరారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. శ్రీలంకలో 2022లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకున్నారు. మార్పు, అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి నినాదాలతో జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాల గురించి వివరించడంతోపాటు, దేశంలో జవాబుదారీతనం, వ్యవస్థాగత మార్పులు రావాలని గట్టిగా చెప్పారు.