Osman Hadi | ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ (Osman Hadi)పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, హాదీ హత్యలో ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హాదీ సోదరుడు షరీఫ్ ఒమర్ హాదీ (Sharif Omar Hadi) తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో యూనస్ (Muhammad Yunus) ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికలను పక్కదారి పట్టించేందుకు ఓ స్వార్థ వర్గం ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు.
షాబాగ్లోని నేషనల్ మ్యూజియం ముందు ఇంఖిలాబ్ మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ హాదీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నా సోదరుడు ఉస్మాన్ హాదీని చంపింది మీరే (యూనస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ). దీన్ని ఓ సమస్యగా చూపించి వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారు. ఎన్నికల వాతావరణం దెబ్బతినకుండా నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలి. హాదీకి న్యాయం జరగకపోతే.. మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది’ అని తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌ను హెచ్చరించారు.
ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాది (32) మరణించిన విషయం తెలిసిందే. హాదీ విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జులైలో జరిగిన ఉద్యమం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమంతో షేక్ హసీనా దేశం వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.
Also Read..
Indian Nationals | అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్
Bangladesh | భారత్‌తో ఘర్షణలు కోరుకోవడం లేదు : బంగ్లాదేశ్
Libya Army Chief | తుర్కియేలో కూలిన ప్రైవేట్ జెట్.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి