Libya Army Chief | తుర్కియే (టర్కీ) రాజధాని అంకారాలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లిబియా ఆర్మీ చీఫ్ మహమూద్ అలీ అల్ హద్దాద్ సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రన్‌వే పైనుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమాన ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉంటుందని వారు భావిస్తున్నారు.
తుర్కియే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారకు వచ్చింది. చర్చలు ముగించుకుని తిరిగి స్వదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎసెన్బొఘా విమానాశ్రయం నుంచి రాత్రి 8.30 గంటలకు విమానం టేకాఫ్ అవ్వగా.. 40 నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానం సంబంధం కోల్పోయింది. దీంతో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్‌కు సమాచారం ఇచ్చారని.. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయాయని తుర్కియే అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అంకారాకు 70 కిలోమీటర్ల దూరంలో విమాన శిథిలాలను అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ మహమూద్ అలీ అల్ హద్దాద్ తో పాటు నలుగురు మిలటరీ అధికారులు, ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. మరణించిన వారిలో గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి జనరల్ అల్ ఫిటౌరీ ఘ్రైబిల్, మిలటరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అథారిటీ హెడ్ బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్ కతావి, చీఫ్ స్టాఫ్ సలహాదారుడు మహమ్మద్ అల్ అసావి దియాబ్, మిలటరీ ఫొటోగ్రాఫర్ మహమ్మద్ ఒమర్ అహ్మద్ మహ్జూబ్ ఉన్నారు. కాగా ఆర్మీ చీఫ్ జనరల్ మహమ్మద్ అలీ మరణించినట్లుగా లిబియా ప్రధాన మంత్రి అబ్దుల్ హమీద్ ధ్రువీకరించారు. ఈ ఘటన నేపథ్యంలో అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గల కారణాలపై తుర్కియే అధికారులు దర్యాప్తు చేపట్టారు. లిబియా ప్రభుత్వం కూడా ప్రత్యేక బృందాన్ని అంకారకు పంపించింది.