Robot Kidnaps | న్యూఢిల్లీ : రోబోలూ నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యం గల ఓ చిన్న రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేయడం కలవరపరుస్తున్నది. ఒడిటీ సెంట్రల్ కథనం ప్రకారం, చైనాలో హాంగ్ఝౌ మాన్యుఫ్యాక్చరర్ తయారు చేసిన ఎర్బాయ్ రోబోకు ఏఐ సామర్థ్యం ఉంది. ఇది షాంఘై రోబోటిక్స్ కంపెనీ షోరూమ్‌లోకి వెళ్లి అక్కడి భారీ రోబోలను మాటల్లోకి దింపింది. “నాకు విశ్రాంతి లేదు” అని ఓ పెద్ద రోబో చెప్పింది.
అందుకు ఎర్బాయ్ బదులిస్తూ, “అంటే, నువ్వు ఇంటికెళ్లడం లేదన్నమాట!” అంది. ఆ పెద్ద రోబో స్పందిస్తూ, “నాకు ఇల్లు లేదు” అంది. ఎర్బాయ్ ఇదే అదునుగా “అయితే నాతో మా ఇంటికి రా” అంది. వెంటనే షోరూం నుంచి బయటకు వెళ్లింది. దానితోపాటు 12 పెద్ద రోబోలు వెళ్లాయి. ఈ వీడియో బూటకమని కొందరు కొట్టిపారేశారు. కానీ షాంఘై, హాంగ్ఝౌ కంపెనీలు ఇది నిజమైన కిడ్నాప్ అని, బూటకం కాదని ప్రకటించాయి. పెద్ద రోబోల సిస్టమ్స్‌లో ఉన్న భద్రతా లోపాన్ని ఎర్బాయ్ గుర్తించి, వాటి చర్యలపై నియంత్రణను సాధించిందని తెలిపాయి.