వాషింగ్టన్, ఏప్రిల్ 26: పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం మరో హత్యాయత్నం జరిగింది. శ్వేతసౌధం సమీపంలోని హిల్టన్ హోటల్లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక డిన్నర్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటన నుంచి ట్రంప్, ఇతర అధికారులు సురక్షితంగా తప్పించుకున్నారు. గత రెండేండ్ల వ్యవధిలో ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం ఇది మూడోసారి. స్థానిక కాలమానం ప్రకారం 8.34 పీఎంకు హోటల్లో డిన్నర్ సర్వ్ చేస్తుండగా బాల్రూమ్ బయట సాయుధుడైన ఒక దుండగుడు పలుసార్లు కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ట్రంప్ వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీజియా జియాంగ్, మానసికవేత్త ఓజ్ పియర్ల్మన్తో సంభాషిస్తున్నారు. కాల్పులు జరగగానే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఇతర రక్షణ సిబ్బంది ట్రంప్‌కు, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఆయన సతీమనణి ఉషా వ్యాన్స్లకు రక్షణగా నిలిచి బాల్రూమ్ నుంచి బయటకు తరలించారు. కాల్పులతో డిన్నర్లో ఉన్న పలువురు నేతలు, పాత్రికేయులు, సెలబ్రిటీలు టేబుళ్ల కింద భయంతో దాక్కున్నారు. కాగా, డిన్నర్‌ను 30 రోజుల లోపు రీ షెడ్యూల్ చేసినట్టు కాల్పుల ఘటన ముగిసిన తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు.
నిందితుడి అరెస్ట్
కాల్పుల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కాల్పులు జరిపిన కాలిఫోర్నియాకు చెందిన నిందితుడిని తమ రక్షణ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. ఒక భద్రతాధికారిపై కాల్పులు జరిపినప్పటికీ అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. కాగా, కాల్పులు జరిపిన నిందితుడు కాలిఫోర్నియాకు చెందిన 31 ఏండ్ల కోల్ థామస్ అలెన్‌గా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉన్నత విద్యావంతుడిగా తేలింది. 2017లో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశారు. ప్రస్తుతం టీచర్‌గా పనిచేస్తున్నట్టు లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఉన్నది. 2024లో బెస్ట్ టీచర్ ఆఫ్ ది మంత్‌గా కూడా ఎంపికయ్యాడు. కాగా, హోటల్ బయట రోడ్డుపై పలువురు నిరసనకారులు బారులుతీరి ట్రంప్ పరిపాలనకు, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాల్పులతో కుంగిపోలేదు
కాల్పుల ఘటన అధ్యక్షుడిగా తనపై ప్రభావం పడుతుందని, తాను ప్రమాదకరమైన ఉద్యోగంలో ఉన్నానని, కానీ తాను కుంగిపోలేదని ట్రంప్ అన్నారు. ‘నేను దాని గురించి ఆలోచించకుండా ఉండటానికే ఇష్టపడతాను. ఇది ప్రమాదకరమైన జీవితం. అయినప్పటికీ నేను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను. దీనిని సాధ్యమైనంత ఉత్తమంగా నిర్వహిస్తున్నానని అనుకుంటున్నాను. భద్రతా సిబ్బంది గొప్పగా విధులు నిర్వహించారు’ అని ఆయన ప్రశంసించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు: మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు వాన్స్ క్షేమంగా ఉన్నారని తెలిసి ఊరట చెందానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, దానిని నిస్సందేహంగా ఖండించాలని అన్నారు. కాల్పుల ఘటన తీవ్రంగా కలవరపెట్టిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. హింస ఎంతమాత్రం మార్గం కాదని మెక్సికన్ అధ్యక్షుడు క్లాడియా షైన్బామ్ పేర్కొన్నారు. గత రెండేండ్లలో ట్రంప్ రెండు హత్యాయత్నాల నుంచి బయటపడ్డారు.
ట్రంప్, అధికారులే లక్ష్యం
అధ్యక్షుడు ట్రంప్, అధికారులే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డట్టు కన్పిస్తున్నదని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు ముందు నిందితుడు కోల్ థామస్ అలెన్ పలు నగరాల్లో సంచరించిన విషయాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. నిందితుడు యూఎస్ వెస్ట్‌కోస్ట్ నుంచి వాషింగ్టన్కు వచ్చి కాల్పులు జరిగిన హోటల్లోనే బస చేశాడన్నారు. మొత్తం 2,600 మంది అతిథులు ఉన్న ప్రధాన బాల్‌రూమ్‌కు బయటే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందన్నారు. ఆ సమయంలో ట్రంప్ స్టేజీపై ఉన్నారని, కాల్పులు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అతడిని చుట్టుముట్టి కాపలాగా సురక్షితంగా తీసుకుని పోయారని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద షాట్‌గన్, హ్యాండ్‌గన్‌తో పాటు పలు రకాల కత్తులు ఉన్నాయన్నారు.