గురువారం 26 నవంబర్ 2020
International - Nov 15, 2020 , 16:20:42

వందకుపైగా పురాతన శవపేటికల వెలికితీత

వందకుపైగా పురాతన శవపేటికల వెలికితీత

కైరో: వందకుపైగా పురాతన శవపేటికలను వెలికితీసినట్లు ఈజిప్ట్‌ శనివారం తెలిపింది. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఇవి బయటపడటం ఇదే తొలిసారని పేర్కొంది. కైరోకు దక్షిణంగా ఉన్న సక్కారా నెక్రోపోలిస్‌లో సుమారు 12 మీటర్ల (40 అడుగులు) లోతులోని మూడు శ్మశానవాటికలలో వందకుపైగా చెక్క శవపేటికలను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈజిప్టులోని పురాతన టోలెమిక్ కాలానికి చెందిన ఉన్నతాధికారులకు చెందినవిగా భావిస్తున్నట్లు చెప్పారు. ముదురు రంగు హైరోగ్లిఫిక్ చిత్రాలతో అలంకరించిన ఒక శవపేటికను పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు. అందులో కవచంలో చుట్టి ఉన్న మమ్మీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిస్ శ్మశానవాటిక. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. నెల రోజుల కిందట ఈ ప్రాంతంలో 2,500 సంవత్సరాల క్రితం నాటి 59 చెక్క శవపేటికలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘సక్కారా ఒక నిధి. దీనికి సంబంధించిన అన్ని అంశాలు వెల్లడి కాలేదు’ అని ఈజిప్ట్‌ పురాతన వస్తువు, పర్యాటక శాఖ మంత్రి ఖలీద్ అల్-అనానీ తెలిపారు. ఇక్కడ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. సార్కోఫాగి ఖననం షాఫ్ట్ ఖాళీ చేయగా, మరొకదానికి ప్రవేశ ద్వారం కనిపిస్తుందని ఆయన వెల్లడించారు. 

ఇటీవల పురాతన దేవతలకు చెందిన 40కిపైగా విగ్రహాలు, అంత్యక్రియల ముసుగులను ఇక్కడ కనుగొన్నట్లు ఖలీద్‌ వివరించారు. గిజా పీఠభూమిలో ఇంకా ప్రారంభించని గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంతో సహా ఈజిప్టులోని పలు మ్యూజియంలకు ఈ శవపేటికలను తరలిస్తామని చెప్పారు. విస్తారమైన నెక్రోపోలిస్‌లో మరో ఆవిష్కరణను రాబోయే వారాల్లో ప్రకటిస్తామన్నారు. మరోవైపు మమ్మీల కోసం చెక్క శవపేటికలను తయారు చేసే పురాతన వర్క్‌షాప్‌ను త్వరలో కనుగొనాలని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారని సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వజీరి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి